
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (ap assembly elections) సంబంధించి జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) గత కొన్నిరోజులుగా స్పష్టమైన సంకేతాలిస్తున్న సంగతి తెలిసిందే. కుదిరితే ఒంటరిగా లేదంటే, టీడీపీ (tdp) - బీజేపీలతో బరిలోకి దిగుతామని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘‘ అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి’’. అంటూ పవన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌ను ఆయన ఎవరిని ఉద్దేశిస్తూ చేశారన్న దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇకపోతే.. వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన (janasena)- బీజేపీ (bjp) ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ కల్యాణ్‌ను ప్రకటించాలంటూ ఇటీవల జనసైనికులు, పవన్ అభిమానులు భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో సైతం ప్రచారం నడిచింది. అదే సమయంలో బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా ఏపీ టూర్‌కి రావడంతో ఏదో ఒక క్లారిటీ వస్తుందని అంతా భావించారు. కానీ వాస్తవంలో జరిగింది వేరు.
బీజేపీ రాజకీయాలు, ఏపీలో పార్టీ పటిష్టత, వైసీపీ పాలనపై విమర్శలు మాత్రమే చేసిన జేపీ నడ్డా (jp nadda) .. పవన్ కల్యాణ్ గురించి కానీ జనసేన గురించి కానీ ఎలాంటి ప్రస్తావనా తీసుకురాలేదు. ఇది ఒక రకంగా జనసేనకు, పవన్ కల్యాణ్‌కు షాక్ వంటిదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పొత్తుల్లో వున్న బీజేపీ- జనసేన మధ్య కనిపించని అడ్డుగోడ వుందని వారు అంటున్నారు. ఏపీలో ఎదగాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న బీజేపీ.. తన మిత్రుడి పేరును మాట మాత్రంగానైనా ప్రస్తావించకపోవడం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
బీజేపీ రావాలి వైసీపీ పోవాలన్న జేపీ నడ్డా.. బీజేపీ- జనసేన ప్రభుత్వం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ పరిణామాలు చూస్తుంటే పవన్‌ని బీజేపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించడానికి ఇష్టపడటం లేదా అనే ప్రశ్న జనసేన వర్గాల మెదళ్లను తొలిచేస్తోంది. అయితే పవన్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించి తీరాలంటూ జనసైనికులు తమకే అల్టీమేటం జారీ చేస్తారా అన్న భావన కమలనాథుల్లో వ్యక్తమైనట్లుగా కనిపిస్తోంది.