తూర్పుగోదావరి జిల్లాలోని టోల్‌ప్లాజా వద్ద బంగారం, కోట్లాది రూపాయల నగదు స్వాధీనమైన వ్యవహారంలో ఏపీ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా విజయవాడలోని శ్రీ పద్మావతి ట్రావెల్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.
విజయవాడలోని ( Vijayawada) శ్రీ పద్మావతి ట్రావెల్స్ (sri padmavathi travels) కార్యాలయంలో పోలీసులు తనిఖీలు (police raids) చేపట్టారు. ట్రావెల్స్‌లో గుమాస్తాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో నగదు లభించిన నేపథ్యంలో.. రెండు వైపుల నుంచి ఎవరెవరు పార్శిళ్లను బుక్ చేశారని ఆరా తీశారు. బస్సులు ఎన్ని గంటలకు బయలుదేరతాయి..? ఎప్పుడు వస్తాయి అనే వివరాలను సేకరించారు. ఈ క్రమంలోనే ఏపీలో అతిపెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టయ్యింది.
బంగారం స్మగ్లింగ్ (gold smuggling) , జీఎస్టీ (gst) ఎగవేతే లక్ష్యంగా హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము (hawala money) , బంగారం రవాణా అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లా పోలీసులు మూడు బస్సులను సీజ్ చేశారు. బస్సులో వుంచే వస్తువులపైనా పోలీసులు ఆరా తీశారు. ఉత్తరాంధ్ర, బెజవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన బంగారం వర్తకుల మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
కాగా.. శుక్రవారం తూర్పు గోదావరి (east godavari) జిల్లా కిర్లంపూడి మండలం వద్ద భారీగా నగదు, బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని కృష్ణవరం గ్రామం జాతీయ రహదారిపై ఉన్న టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాస వెళ్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆపి తనిఖీ చేయగా.. ఒక బస్సులో 10 కేజీల 100 గ్రాముల బంగారం, మరో బస్సులో రూ.5.60 కోట్ల నగదును గుర్తించారు. విజయవాడకు చెందిన ఇద్దరు బంగారం వ్యాపారులు వీటికి ఏ విధమైన బిల్లులు, జీఎస్టీ చెల్లింపులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. పట్టుబడిన బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.