బెజవాడ గ్యాంగ్‌వార్: ఎవ్వరినీ వదలేది లేదన్న పోలీస్ అధికారులు

By Siva KodatiFirst Published Jun 1, 2020, 6:46 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌వార్‌పై డీసీపీ హర్షవర్థన్ స్పందించారు. పెనమలూరులోని ఓ అపార్ట్‌మెంట్ విషయంలో సందీప్, మణికంఠ మధ్య తలెత్తిన విబేధాలే ఈ ఘర్షణకు కారణమని ఆయన తెలిపారు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెజవాడ గ్యాంగ్‌వార్‌పై డీసీపీ హర్షవర్థన్ స్పందించారు. పెనమలూరులోని ఓ అపార్ట్‌మెంట్ విషయంలో సందీప్, మణికంఠ మధ్య తలెత్తిన విబేధాలే ఈ ఘర్షణకు కారణమని ఆయన తెలిపారు. గత నాలుగేళ్లుగా ఇలాంటి ఘర్షణలు జరగలేదని డీసీపీ చెప్పారు.

దీనిలో ఎవరెవరి ప్రమేయం ఉందో వాళ్లపై గట్టి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.  ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగి పరస్పర దాడులు చేసుకున్నారని... ఘర్షణకు కారణమైనవారిని పట్టుకునేందుకు ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని డీసీపీ స్పష్టం చేశారు.

Also Read:బెజవాడ గ్యాంగ్‌వార్‌లో ఓ వ్యక్తి మృతి: ఆసుపత్రిలో అనుచరుల ఆందోళన

వీలైనంత త్వరగా పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.  ఈ ఘర్షణలో విద్యార్థులు ఉంటే వారిపై కేసులు, రౌడీ షీట్ పెడతామని హర్షవర్థన్ హెచ్చరించారు. ఇలాంటి దాడుల్లో విద్యార్ధులు పాల్గొని జీవితాలను నాశనం చేసుకోవద్దని డీసీపీ సూచించారు.

కాగా ఈ గ్యాంగ్ వార్‌లో  గాయపడ్డ తోట సందీప్ కుమార్ చికిత్స పొందుతూ మరణించాడు. ఆటోనగర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సందీప్ అనుచరులు హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగారు.

దీనిని తొలుత రెండు విద్యార్ధి గ్రూపుల మధ్య వివాదంగా అంతా భావించారు. మీడియాలో సైతం ఇదే రకమైన కథనాలు వచ్చాయి. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read:స్టూడెండ్ వార్ కాదది: రూ.2 కోట్ల విలువైన ల్యాండ్ కోసం, హత్యలకు స్కెచ్

రూ.2 కోట్ల విలువైన స్థలం కోసం ఘర్షణ జరిగినట్లు తెలిసింది. నగరంలోని యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఈ వివాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒకే స్థలం విషయంలో ఇద్దరు జోక్యం చేసుకోవడంతో గొడవ జరిగింది.

ఇంతటి విలువైన ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు ఇరువర్గాలు పథకం వేశాయి. రాజీ కుదుర్చుకునేందుకు వచ్చిన ఇరు వర్గాలు ఆ ముసుగులో పథకాన్ని అమలు చేయడానికి రెండు వర్గాలు సిద్ధమయ్యాయి.

పక్కా ప్లాన్‌తో కత్తులు, కర్రలతో వెళ్లినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇరువర్గాలపై ఐపీసీ సెక్షన్ 307 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరువర్గాల రాళ్ల దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

click me!