
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మోదీ జూలై 4న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆ పార్టీ శ్రేణులకు తెలిపారు. ఆకివీడులోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సోము వీర్రాజు.. పార్టీ మండల కార్యాలయంలో స్థానిక నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ప్రధాని మోదీ జూలై 4న భీమవరంకు రానున్నారని, అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో జరిగే అల్లూరి జయంతి కార్యక్రమానికి హాజరు కానున్నారని అక్కడి నాయకులతో సోము వీర్రాజు చెప్పారు.
అయితే భీమవరం పర్యటనకు రానున్న ప్రధాని మోదీ.. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే ప్రధాని పర్యటన విషయం అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. జూలై 4కు ఇంకా చాలా సమయం ఉన్నందున్న.. మోదీ భీమవరం పర్యటకు సంబంధించి అధికారికంగా ప్రకటన మరింత సమయం పట్టవచ్చు.
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జూన్ 7న రాజమహేంద్రవరం వస్తారని సోము వీర్రాజు పార్టీ నాయకులతో చెప్పారు. రాజమహేంద్రవరంలో జరిగే బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. జూన్ 6న విజయవాడలో జరిగే పార్టీ శక్తి కేంద్రాల రాష్ట్ర స్థాయి సమావేశంలో నడ్డా పాల్గొంటారు. జూన్ 7న రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని, వివిధ కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయనే అంశాలను ఆయన హైలెట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.
అయితే ఇరువురు నేతల ఏపీ పర్యటన వెనక బీజేపీ అధిష్టానం వ్యుహాత్మకంగా వ్యవహరిస్తుందనే టాక్ వినిపిస్తుంది. జేపీ నడ్డా, ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనల తర్వాత ఏపీ బీజేపీ రానున్న ఎన్నికలకు సంబంధించి ఓ స్టాండ్ తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తానని చెబుతున్నారు. ఈ మేరకు తాను కృషి చేస్తానని పవన్ చెప్పడం, మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు త్యాగాలకు సిద్దంగా ఉన్నట్టుగా ప్రకటించడంతో.. టీడీపీ - జనసేన వచ్చే ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేస్తాయనే ప్రచారం సాగుతుంది.
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం 2024 ఎన్నికల్లో జనంతో పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు అని కామెంట్ చేశారు. టీడీపీ, జనసేన కలుస్తాయా..? అనే విషయాన్ని పవన్ కల్యాణ్ అడగాలని చెప్పారు. సోము వీర్రాజు ఇలా చెబుతుంటే పవన్ మాత్రం.. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తానన్నారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే, ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానన్నారు.అయితే పొత్తుల విషయంలో బీజేపీ వైఖరి ఏమిటనేది జేపీ నడ్డా ఏపీ పర్యటన తర్వాత ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.