జగన్, బాబుల్లా కాదు: కాపు కోటాపై వైఖరి స్పష్టం చేసిన పవన్

By pratap reddyFirst Published 13, Aug 2018, 7:15 PM IST
Highlights

కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలా తాను పారిపోనని, ముఖ్యమంత్రి చంద్రబాబులా తాను దొంగచాటు వ్యవహారం చేయబోనని ఆయన అన్నారు. 

తాడేపల్లిగూడెం: కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలా తాను పారిపోనని, ముఖ్యమంత్రి చంద్రబాబులా తాను దొంగచాటు వ్యవహారం చేయబోనని ఆయన అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన అన్నారు. తన వైఖరిని ప్రకటించడానికి ముందు ఆయన కులాల గురించి చాలా మాట్లాడారు.  

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ జనసేన పోరాటం చేస్తుందని, కాపులకు తాను అండగా ఉంటానని ఆయన అన్నారు. బీసీలకు అన్యాయం జరుగకుండా వారికి చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ ను నెహ్రూ ప్రభుత్వం ఎందుకు చేర్చిందనే విషయాన్ని ఆయన వివరించారు. 

కాపులకు రిజర్వేషన్లు కల్పించలేనని జగన్ పారిపోయారని, 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్రానికి పంపించి చంద్రబాబు దొంగచాటు వ్యవహారం నడుపుతున్నారని, తాను అలా చేయబోనని పవన్ కల్యాణ్ అన్నారు. 

కాపులు రిజర్వేషన్లు అడిగారు, నాకు నా కులం తెలియదు. అన్ని కులాల్లోనూ అన్ని జాతుల్లోనూ రక్తరం రంగు ఒక్కటేనని అన్నారు. తన తల్లిదండ్రులు తనకు కులం చెప్పలేదని, మానవత్వమూ సంస్కారమూ ఇచ్చారని, ఏ కులంలో పుట్టాలనే విషయంలో తనకు చాయిస్ లేదని అన్నారు. 

మాల కులంలో పుట్టినా, మాదిగ కులంలో పుట్టినా, శెట్టిబలిజ కులంలో పుట్టినా తాను సంతోషించేవాడనని, కానీ వేరే కులంలో పుట్టానని అన్నారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ కు మద్దతు ఇవ్వబోమని కొందరు కాపులు నాయకులు అన్నారని, కులాన్ని నమ్ముకుని పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు అన్నారని, తాను కులాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని ఆయన అన్నారు. మానవత్వాన్ని నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు. కులాన్ని నమ్ముకుంటే గతంలో తాను టీడీపికి ఎందుకు మద్దతిస్తానని అన్నారు. 

అంబేడ్కర్, గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్సింగ్,  చంద్రశేఖర్ ఆజాద్ ఏదో కులానికి చెందినవారు కారని ఆయన అన్నారు. తాను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని, అన్ని కులాలను గౌరివించినట్లుగానే తన కులాన్ని గౌరవిస్తానని ఆయన అన్నారు. తన లాగా కులం గురించి జగన్ గానీ, చంద్రబాబు గానీ చెప్పగలరా అని ఆయన అడిగారు. పవన్ ఏ ఒక్క కులానికో, మతానికో చెందినవాడు కాడని అన్నారు. 

కాపులను బ్రిటిష్ పాలకులు బీసీలుగా గుర్తించారని, అవసరం తీరాక కొంత తీసేశారని, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు, తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్నారని, తమ బీసీ హోదాను పునరుద్ధరించాలని కాపులంతా కోరుతున్నారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు కల్పించలేకపోతే చంద్రబాబు ఎందుకు మాటిచ్చారని, జగన్ గతంలో ఎందుకు నిలబడ్డారని ఆయన అడిగారు.

కాపులకు రిజర్వేషన్లు సాధించడానికి పోరాటం చేస్తామని, 9వ షెడ్యూల్ లో కాపు రిజర్వేషన్లను చేర్చాలని కేంద్రంపై ఒత్తిడి పెడుతామని ఆయన అన్నారు. 

Last Updated 9, Sep 2018, 10:53 AM IST