
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమరానికి సై అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ప్రజా పోరాట యాత్రలతో ప్రజల మధ్య గడిపిన పవన్ కళ్యాణ్ ఇక పార్టీ బలోపేతంపై దృష్టి సారించనున్నారు. అమరావతి కేంద్రంగా జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
గురువారం అమరావతిలోని జనసేన కార్యాలయంలో ప్రారంభమైన ఈ సమీక్ష సమావేశాలను మాజీ స్పీకర్ జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సమీక్ష సమావేశానికి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యారు.
తొలుత శ్రీకాకుళం జిల్లా నాయకులతో పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతలను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీకి అన్ని సామాజిక వర్గాల ప్రజల మద్దతు ఉందని నేతలు తెలిపారు. అన్ని సామాజికవర్గాల మధ్య సయోధ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో అభివృద్ధి చెందుతున్న కులాల వారికి అండగా ఉంటూనే వెనుకబడిన కులాల వారిని ముందుకి తీసుకువెళ్లాల్సిన అవసరం జనసేన శ్రేణులపై ఉందని నేతలు సూచించారు. ఈ సందర్భంగా పవన్ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. జనసేన పార్టీకి విశేషంగా ఉన్న యువశక్తిని రాజకీయ శక్తిగా మార్చాలని సూచించారు.
పార్టీ వర్కింగ్ క్యాలెండర్‌కి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ వర్కింగ్ క్యాలెంటర్ ను అన్ని జిల్లాలు అమలు చేసి పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పార్టీ ప్రతినిధిగా బహిరంగంగా మాట్లాడేప్పుడు సంస్కారవంతమైన భాష ఉపయోగించాలని, పార్టీ నియమావళికి అనుగుణంగా నడుచుకోవానలి సూచించారు.
యువత సాధికారిత కోసం రాజీలేని దృఢ నిశ్చయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. జనవరి చివరి వారంలో ఉత్తరాంధ్ర జిల్లాలకి సంబంధించి ప్రాంతీయ పార్టీ సమావేశం నిర్వహించనున్నట్టు పవన్ స్పష్టం చేశారు.
జనసేన పార్టీ లక్ష్యాలను, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని పవన్ ఆదేశించారు. బూత్ లెవెల్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు అవసరమయ్యే అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని పవన్ కోరారు.