టీడీపీ,జనసేన కలిసినా అమీతుమీ పోటీ: పవన్ కళ్యాణ్

Published : Oct 02, 2023, 07:47 PM IST
టీడీపీ,జనసేన కలిసినా అమీతుమీ పోటీ: పవన్ కళ్యాణ్

సారాంశం

జనసేనను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇవాళ  మచిలీపట్టణంలో పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.

విజయవాడ:ఏపీలో టీడీపీ,జనసేన కలిసినా అమీతుమీ పోటీ ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. సోమవారం నాడు మచిలీపట్టణంలో జనసేన కార్యకర్తల సమావేశంలో  పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.  రాష్ట్రంలో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు అంత సులభం కాదన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టీడీపీని తక్కువ చేసి చూడకూడదన్నారు. నాలుగు దశాబ్దాలుగా  రాజకీయాల్లో ఉన్న చంద్రబాబును తక్కువ అంచనా వేయకూడదని పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు సూచించారు. టీడీపీతో గతంలో ఉన్న గొడవలను మర్చిపోదామని ఆయన  కోరారు. తాను సీఎంను అవుతానా లేదా అనేది గెలిచే సీట్లను బట్టి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎవరు రాజు, ఎవరు మంత్రి అనేది సీట్లను గెలిచాక తేలుతుందన్నారు. ఒంటరిగా పోటీ చేస్తే  తక్కువ సీట్లలో విజయం సాధిస్తామో తెలియదని తెలిపారు.

 వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గత మాసంలో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ప్రకటన చేసిన తర్వాత  నిన్ననే  నాలుగో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.ఒక్క కులం వల్ల అధికారం రాదన్నారు. జనసేన ప్రాంతీయ పార్టీ కాదని ఆయన చెప్పారు. దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని జనసేన ఆవిర్భవించిందని ఆయన వివరించారు. భవిష్యత్తులో జనసేన ఆలోచన దేశవ్యాప్తంగా వెళ్తుందని పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు. తాను కాపు సామాజిక వర్గంలో పుట్టానన్నారు. అలా అని కేవలం కాపు ఓటు బ్యాంకు తీసుకుంటే ఎక్కడ ఎదుగుతామని ఆయన ప్రశ్నించారు.ఆ రకంగా ఆలోచిస్తే తాను  కుల నేతగా మిగిలిపోతానని పవన్ కళ్యాణ్ చెప్పారు. జనసేన ఒక కులానికి చెందిన పార్టీ కాదన్నారు. ఒక కులానికి అంటగట్టి తనను ఎందుకు కులనేతను చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. 

మచిలీపట్టణం తనను ఎంతగానో ప్రభావితం చేసిన నేలగా  పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పింగళి వెంకయ్య, వెంకటరత్నం నాయుడు పుట్టిన నేలగా ఆయన గుర్తు చేసుకున్నారు.మచిలీపట్టణానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉందని  పవన్ కళ్యాణ్ చెప్పారు. పింగళి వెంకయ్య ఆకలితో చనిపోవడం బాధాకరమన్నారు. కులాల ఐక్యత గురించి తాను పదే పదే చెబుతానన్నారు. కుల సమీకరణాల గురించి ఆలోచిస్తే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదన్నారు. కాపు సామాజిక వర్గంలో పుట్టినా తాను అన్ని కులాలను సమదృష్టితో చూసే వ్యక్తినని ఆయన చెప్పారు.తాను కులాలను వెతుక్కొని స్నేహం చేయనన్నారు.

జగన్ సర్కార్ ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదవులు ఇస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన  ప్రశ్నించారు. పార్టీ పెట్టగానే అధికారం అందుకోవడం ఒక్క ఎన్టీఆర్ కే సాధ్యమైందన్నారు.జగన్ ను కూడ పదేళ్లు చూసిన తర్వాతే ప్రజలు ఆయనకు ఓటు వేసి అధికారం కట్టబెట్టారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత  జగన్ ప్రజలను పీడిస్తున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాజధానికి 30 వేల ఎకరాలు అన్నప్పుడే తాను విభేదించినట్టుగా పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.

రాజధాని అనేది రాత్రికి రాత్రి అభివృద్ధి కాదని పవన్ కళ్యాణ్ చెప్పారు.పాలసీ పరంగానే తాను టీడీపీతో విబేధించినట్టుగా పవన్ కళ్యాణ్ వివరించారు.జగన్ ను తాను చిన్నప్పటి నుండి చూస్తున్నట్టుగా  పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రానికి జగన్ సరైనవాడు కాదని ఆనాడే అనుకున్నానన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు