చంద్రన్నకు సెలవిద్దాం, జగన్ ను పక్కన పెడదాం:పవన్ కళ్యాణ్

By Nagaraju TFirst Published Nov 27, 2018, 9:02 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. అనుభవజ్ఞుడని నమ్మకంతో టీడీపీకి మద్దతు పలికితే ఆ పార్టీ మోసం చేసిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా ముమ్మిడివరం బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ టీడీపీ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. 

ముమ్మిడివరం: తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. అనుభవజ్ఞుడని నమ్మకంతో టీడీపీకి మద్దతు పలికితే ఆ పార్టీ మోసం చేసిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా ముమ్మిడివరం బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ టీడీపీ పాలనలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు. 

తెలంగాణ అంటే చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ లకు భయమన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంటే జగన్ ప్రశ్నించలేకపోయారన్నారు. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతంతో తప్పించుకు వచ్చేశారన్నారు. 

 ఏమీ ఆశించకుండా తాను తెలుగుదేశం పార్టీకి 2014 ఎన్నికల్లో మద్దతు పలికానన్నారు. కానీ ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చెయ్యలేదన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారంటే అది జనసేన వల్ల మాత్రమేనన్నారు. 

తన మద్దతు లేకపోతే టీడీపీ 39 సీట్లతోకో 40 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదాకే పరిమితమయ్యేదన్నారు. 

మరోవైపు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తనకు ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడిగా మాత్రమే తెలుసని, కానీ న్యూస్‌ పేపర్లలో అతని గురించి చదివి ఆశ్చర్యపోయానని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. 

సుజనా చౌదరి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వేలకోట్లు దోచేశారని, కార్లు సీజ్‌ అయ్యాయని వార్తా పేపర్లలో చదివి షాక్‌ గురయ్యానని తెలిపారు. టీడీపీ రాష్ట్రాన్ని దోచేసిందే తప్పా అభివృద్ధి చేయలేదన్నారు.   

డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేయరు కానీ పారిశ్రామిక వేత్తలు, రాజ్యసభ సభ్యులు మాత్రం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించరని మండిపడ్డారు. అయినా బ్యాంకులు వారిని ఏమి చేయలేవన్నారు.

 సొంతపార్టీ ఎమ్మెల్యే ఆకురౌడీలా, వీధి రౌడీలా వ్యవహరిస్తుంటే అదుపు చేయలేని చంద్రబాబు నాయుడు ఓ ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. ఆడపడుచులను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొడుతుంటే సస్పెండ్‌ చేయలేని వ్యక్తి ఏం సీఎం అని నిలదీశారు. 

యువత త్యాగాలు చేయాలని సీఎం చంద్రబాబు చెప్తున్నారని మరి చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. యువత, తాము త్యాగాలు చేస్తే వారబ్బాయి లోకేష్ రాజధాని రోడ్లపై తిరుగుతాడా? అని నిలదీశారు. మాట్లాడితే చంద్రబాబు సింగపూర్‌ తరహా అభివృద్ధి అంటారని, మరి ఆ అభివృద్ధి ఎక్కడ కనపడుతుందో చెప్పాలన్నారు.

ఇకపోతే అవినీతిలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. ఇరుపార్టీలు బయట తిట్టుకుంటున్నా మాత్రం దోచుకోవడంలో ఒక్కటేనని విమర్శించారు. తెలుగుదేశం నాయకులను నిలదీస్తే తన విషయాలు బయటకు వస్తాయని జగన్ భయపడి అసెంబ్లీకి వెళ్లకుండా  రోడ్లపై తిరుగుతున్నాడని విమర్శించారు. 

ఒకవేళ జగన్ స్థానంలో తాను ఉండి ఉంటే ఎమ్మెల్యేలంతా అమ్ముడు పోయినా  తాను మాత్రం అసెంబ్లీకి హాజరవుతానన్నారు. జగన్ కు మోదీ అంటే భయం, చంద్రబాబు అంటే భయం, తెలంగాణ అంటే భయం అని పవన్ విమర్శించారు. 

అందరికీ భయపడే జగన్ ప్రతిపక్ష నేతగా అనర్హుడు అంటూ విమర్శించారు. జగన్ అవినీతి పరుడు కాబట్టే అధికార పార్టీని నిలదీయలేకపోతున్నాడని విమర్శించారు. జగన్ అవినీతి ఆరోపణలు, ఆయన కేసులు వల్ల టీడీపీని నిలదియ్యలేకపోతున్నాడన్నారు. 

అన్ని కులాలను మతాలను ఒకే రకంగా చూసే నాయకుడు కావాలని కోరారు. ఇసుక, మట్టి మాఫియాలు రాష్ట్రంలో రెచ్చిపోతున్నాయన్నారు. ఏ నియోజకవర్గం చూసినా దాదాపుగా వెయ్యికోట్లు అవినీతికి పాల్పడ్డారని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. 

వైసీపీ, టీడీపీల అవినీతికి చరమగీతం పాడాలంటే జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురాడమేనని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే చంద్రన్నకు సెలవిద్దాం, జగన్ ను పక్కన పెడదాం జనసేనని గద్దెనెక్కిద్దామని పవన్ అన్నారు.

మతాలు, కులాలు వర్గాలుగా తెలుగుదేశం పార్టీ విభజించి పాలిస్తుందని పవన్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఒక్కటిగా ఉండాలన్నదే తమ పార్టీ లక్ష్యమన్నారు. నాలుగు దశాబ్ధాల అనుభవం ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో అవినీతిని అరికట్టలేకపోయారన్నారు. 

వైసీపీ, టీడీపీలకు చెందిన నేతలు సైతం జనసేనకు మద్దతు పలుకుతున్నారని పవన్ తెలిపారు. రాజధాని భూ సమస్యల, శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలు జనసేనకు మద్దతు ప్రకటించారన్నారు.   

click me!