అమరావతి వివాదం: పవన్ కల్యాణ్ కు పార్థసారథి ప్రశ్నల వర్షం

By telugu teamFirst Published Aug 31, 2019, 10:05 PM IST
Highlights

రాజధానిని మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రకటించారా అని పార్థసారథి పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. జనసేన, టీడీపి కలిసి రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. 

అమరావతి: అమరావతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కొలును పార్థసారథి తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ కల్యాణ్ కు ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై టీడీపి, జనసేన తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను ఎల్లో మీడియా వక్రీకరించి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని ఆయన శనివారం మీడియా సమావేశంలో అన్నారు. రాజధానిని మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రకటించారా అని పార్థసారథి పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. జనసేన, టీడీపి కలిసి రాజధానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని పార్థసారథి విమర్శించారు. 

గత ఐదేళ్ల పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి సంసారం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు చంద్రబాబు అవినీతి కనిపించలేదా, టీడీపి పాలనను పవన్ సమర్థిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో ఒక్కసారైనా చంద్రబాబును పవన్ కల్యాణ్ ప్రశ్నించారా అని అడిగారు. 

కర్నూలును రాజధానిగా చేయాలని పవన్ కల్యాణ్ కోరిన విషయం నిజం కాదా అని అడిగారు. రాజధానిలో జరిగిన అవినీతి గురించి తెలిసినా కూడా ఎందుకు ప్రశ్నించలేదని ఆయన పవన్ కల్యాణ్ ను అడిగారు. లింగమనేని భూములను ఎందుకు భూసేకరణకు తీసుకోలేదని ఆయన అడిగారు. 

ఇసుకను మింగింది టీడీపి నేతలు కాదా, ఇసుకను తక్కువ ధరకు అందిచాలని తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిందలు వేస్తారా అని ఆయన అడిగారు. అసెంబ్లీలో ఫర్నీచర్ మాయంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని పార్థసారథి అడిగారు. 

click me!