పరిషత్ ఎన్నికల రద్దు: ఏకగ్రీవాలపై స్పష్టత ఇచ్చిన ఏపీ ఎస్ఈసీ

By telugu teamFirst Published May 22, 2021, 9:37 AM IST
Highlights

ఎంపీటీసీ, జడ్పీటీసి ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలు చెల్లుబాటు అవుతాయని ఏపీ ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ ను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని అంటున్నాయి.

అమరావతి: పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అంతకు ముందు జరిగిన ఏకగ్రీవాలపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) స్పష్టత ఇచ్చారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జడ్పీటీసీలు యధాతథంగా ఉంటారని ఎపీ ఎస్ఈసీ అధికార వర్గాలు చెప్పాయి. 

నిరుడు, అంటే 2020 మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల సమయంలో ఏకగ్రీవాలు జరిగిన స్థానాలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 2020  మార్చిలో జరిగిన నామినేషన్ల ప్రక్రియను హైకోర్టు రద్దు చేయలేదని, కరోనా తర్వాత మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను తిరిగి నిర్వహించడానికి జారీ చేసిన నోటిఫికేషన్ ను మాత్రమే రద్దు చేసిందని ఏపీ ఎస్ఈసీ స్పష్టం చేసింది. 

2020 మార్చిలో మధ్యలో ఆగిపోయిన ఎన్నికలను 2021లో తిరిగి నిర్వహించే విషయంలో జారీ చేసిన నోటిఫికేషన్ కు, పోలింగుకు మధ్య సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు 4 వారాల గడువు లేదని మాత్రమే హైకోర్టు స్పష్టం చేసిందని ఎపీ ఎస్ఈసి వర్గాలు అంటున్నాయి. 

ఎంపిటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఏప్రిల్ 1వ తేదీన జారీ చేసిన నోటిపికేషన్ ను మాత్రమే కోర్టు రద్దు చేసిందని స్పష్టం చేశారు. 2020 మార్చిలో ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ వరకు జరిగిన ప్రక్రియ యావత్తు చెల్లుబాటులో ఉంటుందని అంటున్నాయి. హైకోర్టు తాజా తీర్పుపై డివిజన్ బెంచ్ కు వెళ్లాలని ఏపీ ఎస్ఈసీ నిర్ణయించినట్లు సమాచారం.

click me!