దగ్గుబాటి దంపతులకు జగన్ అల్టిమేటం: ప్రస్తుతానికి సేఫ్, వారం రోజుల తర్వాత....

By Nagaraju penumalaFirst Published Oct 18, 2019, 9:05 PM IST
Highlights


కేంద్రమాజీమంత్రి పురంధేశ్వరి నిర్ణయంపైనా ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతుందట దగ్గుబాటు ఫ్యామిలీ.  

ప్రకాశం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత పర్చచూరు నియోజకవర్గం ఇంచార్జ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. భర్త ఒక పార్టీలో, భార్య మరో పార్టీలో ఉండటం సరికాదని ఇద్దరూ ఏదో ఒక పార్టీలో ఉండాలని ఆదేశించారు. 

భార్య భర్తలిద్దరూ చెరోకపార్టీలో ఉండటం వల్ల నియోజకవర్గంలో పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని సీఎం జగన్ అభిప్రాయపడినట్లు ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.  

పర్చూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తుండగా జాతీయ పార్టీ అయిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా హోదాలో ఆయన భార్య మాజీ  కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారని ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఉండటం భావ్యం కాదని జగన్ అభిప్రాయపడినట్లు తెలిపారు. 

దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ వ్యవహారంపై దగ్గుబాటి అనుచరులు శుక్రవారం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. 

పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావునే కొనసాగించాలని కోరారు. అయితే ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ గా దగ్గుబాటి వెంకటేశ్వరరావే వ్యవహరిస్తారని హామీ ఇచ్చారట. 

అయితే దగ్గుబాటి పురంధేశ్వరి వేరే పార్టీలో ఉండటం సరికాదని ఆమె వైసీపీలోకి వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారట. దగ్గుబాటి దంపతులు ఏ పార్టీలో ఉంటారో తేల్చుకోవాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి దగ్గుబాటి అనుచరులకు క్లారిటీ ఇచ్చేశారు. 

దగ్గుబాటి పురంధేశ్వరి పార్టీలోకి వస్తే ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని కూడా సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరి దగ్గుబాటి దంపతులు ఏ పార్టీలో ఉంటారో వారం రోజుల్లోగా తేల్చుకోవాలని సీఎం జగన్ సూచించారని అల్టిమేటం జారీ చేశారట మంత్రిగారు. 

ఇకపోతే ఎన్నికల ముందు వరకు పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ గా ఉన్న రామనాథం బాబు ఇటీవలే వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ పదవి నుంచి రామనాథంబాబును జగన్ తప్పించి ఆ బాధ్యతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంకు అప్పగించారు. 

అయితే హితేష్ చెంచురాంకు పౌరసత్వం ఇబ్బందులు తలెత్తడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయాల్సి వచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చేతిలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఘోరంగా ఓటమిపాలయ్యారు. 

సార్వత్రిక ఎన్నికల్లో తన ఓటమికి రావి రామనాథంబాబు కూడా కారణమని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఆయనను పార్టీలోకి తీసుకురావడంపై గుర్రుగా ఉన్నారు. తాము పార్టీలో ఉండగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఎలా తీసుకుంటారని దగ్గుబాటి కుటుంబం మదనపడుతోందట.

ఇకపోతే ఎన్నికల అనంతరం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల్లో అంత ఉత్సాహంగా కనిపించడం లేదని నియోజకవర్గంలో టాక్. కానీ దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలను సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారట. 

ప్రస్తుతానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి సేఫ్ అనే చెప్పాలి. రావి రామనాథం బాబుకు జిల్లా సహకార సంఘం అధ్యక్షుడిగా చేయడంతో నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉండదని భావిస్తున్నారు. 

అయితే దగ్గుబాటి పురంధేశ్వరి భర్త మాట విని వైసీపీ తీర్థంపుచ్చుకుంటే ఆమెకు  రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పురంధేశ్వరి భర్త వెనుక నడుస్తారా లేక గతంలో ఎలా అయితే వేర్వేరుగా ఎన్నికల్లో పోటీచేశారో అలాగే ఎవరి పార్టీ వారిదేనంటూ విడివిడిగా ఉంటారా అన్నది వేచి చూడాలి. 

ఒకవేళ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీని వీడి వైసీపీలోకి రానిపక్షంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావును పర్చూరు నియోజకవర్గం ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. 

కేంద్రమాజీమంత్రి పురంధేశ్వరి నిర్ణయంపైనా ఆమె భర్త వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ చెంచురాంల రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి గుడ్‌ బై చెప్పి, వైసీపీలో చేరతారా? లేకపోతే రాష్ట్రంలో పవర్‌లో వున్న వైసీపీలోకి వెళతారా అన్నది ఎటూ తేల్చుకోలేకపోతుందట దగ్గుబాటు ఫ్యామిలీ.  


 

click me!
Last Updated Oct 18, 2019, 9:05 PM IST
click me!