పలమనేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

By Siva KodatiFirst Published Mar 27, 2024, 7:13 PM IST
Highlights

చెన్నై, బెంగళూరు నగరాలకు సమీపంలో వుండటంతో వాణిజ్యపరంగా, భౌగోళికంగా పలమనేరుకు ప్రాధాన్యత ఏర్పడింది. చింతపండు, వేరుశెనగ పంటలకు పలమనేరు కేంద్రం.   ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత నుంచి నేటి వరకు పలమనేరులో ఆ పార్టీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి. పలమనేరులో హ్యాట్రిక్ సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృత నిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడకు టికెట్ కేటాయించారు. అమర్‌నాథ్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు చంద్రబాబు 

చిత్తూరు జిల్లాలోని పలమనేరు  నియోజకవర్గం విలక్షణమైనది . ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులకు దగ్గరగా వుండటంతో ఇక్కడ మూడు ప్రాంతాల సంస్కృతులు, ఆచార వ్యవహారాలు వున్నాయి. చెన్నై, బెంగళూరు నగరాలకు సమీపంలో వుండటంతో వాణిజ్యపరంగా, భౌగోళికంగా పలమనేరుకు ప్రాధాన్యత ఏర్పడింది. నాలుగో నెంబర్ జాతీయ రహదారి ఈ పట్టణం మీదుగా పోతూ వుండటంతో రాకపోకలకు అనువుగా వుంటుంది. చింతపండు, వేరుశెనగ పంటలకు పలమనేరు కేంద్రం. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు పంటలు ఎగుమతి అవుతాయి. అలాగే పలమనేరులో పట్టు పరిశ్రమ కూడా విలసిల్లుతోంది. ఇక్కడి పట్టును కర్ణాటకలో విక్రయించి మంచి లాభాలు గడిస్తున్నారు వ్యాపారులు. 

పలమనేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ కంచుకోట :

1952లో ఏర్పడిన పలమనేరు నియోజకవర్గం తొలినాళ్లలో ఎస్సీ రిజర్వ్‌డ్‌. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పలమనేరురు ఎస్సీ నుంచి జనరల్‌ కేటగిరి కిందకు మార్చారు. పలమనేరు సెగ్మెంట్ పరిధిలో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్దపంజని, వీ కోట మండలాలున్నాయి. ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 1983లో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత నుంచి నేటి వరకు పలమనేరులో ఆ పార్టీ 6 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచాయి.

పలమనేరులో మొత్తం ఓటర్ల సంఖ్య 2,67,171 మంది. వీరిలో పురుషులు 1,32,342 మంది.. మహిళలు 1,34,828 మంది. రెడ్డి, మాల, మైనారిటీ వర్గాల ఓటర్లు పలమనేరులో అధికం. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఎన్ వెంకటే గౌడకు 1,19,241 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి ఎన్ అమర్‌నాథ్ రెడ్డికి 86,995 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 32,246 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి పలమనేరులో విజయం సాధించింది. 

పలమనేరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే .. పలమనేరులో హ్యాట్రిక్ సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృత నిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటే గౌడకు టికెట్ కేటాయించారు. మరోవైపు.. తన ఒకప్పటి కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమర్‌నాథ్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. సంప్రదాయ టీడీపీ ఓట్లతో పాటు అమర్‌నాథ్ రెడ్డికి స్థానికంగా వున్న పట్టు , జనసేన బీజేపీలతో పొత్తు తెలుగుదేశం పార్టీకి ప్లస్ కానున్నాయి. వైఎస్ జగన్ మాత్రం సంక్షేమ పథకాలను నమ్ముకుని బరిలోకి దిగుతున్నారు. 

click me!