నిమ్మగడ్డ రమేష్ కుమార్ 'పంచాయతీ': హైకోర్టుకు వైఎస్ జగన్ సర్కార్

By telugu teamFirst Published Jan 9, 2021, 9:35 AM IST
Highlights

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంపై సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మండిపడుతోంది. నిమ్మగడ్డ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించడానికి సన్నద్ధమవుతోంది.

అమరావతి: ఏపీ ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించనుంది. రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాము ఎన్నికలను నిర్వహించలేదమంటూ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి సిద్ధపడుతోంది.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సి ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అంటూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టును కోరనుంది. 

నాలుగు దశలుగా స్థానికలు ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నాలుగు దశల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాలుగు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కూడా తెలిపారు. 

స్థానిక సంస్థల పోలింగ్ ఫిబ్రవరి 17వ తేదీన జరుగుతుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన తరుణంలో ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని నియోగించడం, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం అంటోంది.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, వైఎస్ జగన్ ప్రభుత్వానికి మధ్య వివాదం కొనసాగుతూ వస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో స్థానిక సంస్థలు నిర్వహించకుండా చూడాలనే వ్యూహాలతో జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. తన హయాంలో ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారు. 

click me!