కరోనా విశ్వరూపం: ఆంధ్రప్రదేశ్ లో రాత్రి కర్ఫ్యూ?

By telugu teamFirst Published Apr 17, 2021, 12:29 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దానివల్ల కొంత మేరకు కోవిడ్ కు అడ్డుకట్ట వేయవచ్చునని అనుకుంటోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే వారం నుంచి రాత్రి కర్ప్యూ పెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి కర్ప్యూ పెట్టడం ద్వారా కొంత మేరకు కోవిడ్ వ్యాప్తిని నివారించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. 

రాష్ట్రంలో పాఠశాలలు నడిపే విషయంపై కూడా ఓ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో పదో తరగతి పరీక్షలపై రాష్ట్రంలో ఉద్విగ్న వాతావరణం చోటు చేసుకుంది. పరీక్షలు యథావిధిగా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పరీక్షలు పెడితే ఎలా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. వారాంతంలో విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు వంటి నగరాల్లో కొన్ని ఆంక్షలు పెట్టాలని కూడా ఆలోచన చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని నిబంధనలను పెట్టే యోచన కూడా చేస్తోంది. 

రాత్రి పది గంటల నుంచి మర్నాడు ఉదయం 5 లేదా 6 గంటల వరకు కర్ఫ్యూ విధించే అవకాశాలున్నాయి. ప్రజలు గుమికూడకుండా చూస్తారు. రాత్రి పూట ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేసే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఈ స్థితిలో ఏపీలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలనే డిమాండు వినిపిస్తోంది.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శి పద్మారావు మృత్యువాత పడ్డారు. ఆయన శనివారం తెల్లవారుజామున మరణించారు. దాదాపు 60 మంది సచివాలయ ఉద్యోగులకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. 

సచివాలయంలో ప్రతి శుక్రవారం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో బాగంగా శుక్రవారం నాడు 200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 60 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. 

కరోనాతో మృతి చెందిన పద్మారావు భార్య కూడా సచివాలయంలోనే పనిచేస్తున్నారు. ఆమెకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు ఐఎఎస్ అధికారులకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో శాఖాధిపతులు (హెచ్ఓడీలు) ఎవరూ సచివాలయానికి రావడం లేదు. హెచ్ఓడీలు విజయవాడ, గుంటూరుల్లోని తమ కార్యాలయాల నుంచే పనిచేస్తున్నారు. 

కరోనా వైరస్ వ్యాపిస్తున్న కారణంగా తమకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది.

కాగా, గన్నవరం విమానాశ్రయానికి మరో 5 లక్షల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి.తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి అవి చేరాయి. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ డోసులు వెళ్తాయి. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత కొంత మేరకు తీరనుంది.

click me!