తిరుపతి రైల్వే స్టేషన్‌ నమూనాపై ఆగ్రహం.. ‘వెస్ట్రన్ డిజైన్ కాపీ చేయడమే వరల్డ్ క్లాసా?’.. ‘మన సంస్కృతి ఏదీ?’

Published : May 31, 2022, 03:11 PM ISTUpdated : May 31, 2022, 03:18 PM IST
తిరుపతి రైల్వే స్టేషన్‌ నమూనాపై ఆగ్రహం.. ‘వెస్ట్రన్ డిజైన్ కాపీ చేయడమే వరల్డ్ క్లాసా?’.. ‘మన సంస్కృతి ఏదీ?’

సారాంశం

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేసిన తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్‌పై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది పూర్తిగా వెస్ట్రన్ స్టైల్‌ను కాపీ చేసినట్టుగా ఉన్నదని, స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత ప్రతిబింబించేలా నమూనా ఉండాలని నెటిజన్లు సీరియస్ అయ్యారు.  

హైదరాబాద్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తిరుపతి రైల్వే స్టేషన్ నమూనాను విడుదల చేశారు. ప్రపంచ ప్రసిద్ద టెంపుల్ టౌన్ తిరుపతి రైల్వే స్టేషన్ పనులు వేగవంతం చేశామని, ఇప్పటికే కాంట్రాక్టులు అప్పగించేశామని వివరించారు. ఇది వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ అని పేర్కొన్నారు. అయితే, కేంద్ర మంత్రి విడుదల చేసిన తిరుపతి రైల్వే స్టేషన్ నమూనాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆ నమూనా ఓ ప్రభుత్వ కార్యాలయంగా, ఓ కార్పొరేట్ ఆఫీసు తీరులో కనిపిస్తున్నదని మండిపడుతున్నారు. భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతిని ఈ డిజైన్ ప్రతిబింబిచడం లేదని ఫిర్యాదులు చేశారు.

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్‌కు సంబంధించి కొన్ని చిత్రాలను విడుదల చేశారు. అందులో బయటి నుంచి ఆ స్టేషన్ తీరును వెల్లడించేవి ఉన్నాయి. రైల్వే స్టేషన్ లోపల డిజైన్‌నూ వివరించే చిత్రం ఒకటి ఉన్నది. అందులో ఓ పిల్లర్‌పై వెంకటేశ్వరుడి చిత్రం ఉన్నది. అంతకు మించి మరెక్కడా తిరుపతి ఆలయం గానీ, తిరుపతి దేవుడి చిత్రాలు లేదా సంస్కృతి కనిపించలేదు.

కొందరైతే.. ప్రస్తుతం ఉన్న తిరుపతి రైల్వే స్టేషన్ చాలా నయం అని వాదించారు. ప్రస్తుత రైల్వే స్టేషన్ మందిరం రూపంలో ఉన్నదని, స్టేషన్‌లో దిగగానే భక్తులకు ఒక రకమైన ఉల్లాసం కలుగుతుందని ఫైర్ అయ్యారు. తిరుపతికి రోజు సుమారు 70 వేల నుంచి 80 వేల మంది భక్తులు వస్తుంటారని, అంతటి ప్రశస్తి కలిగిన ఈ ఆధ్యాత్మిక నగరానికి రైల్వే స్టేషన్‌ను పూర్తిగా పాశ్చాత్యుల డిజైన్‌లోకి మార్చడం ఆక్షేపణీయం అని సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

 

అన్నింటిని వరల్డ్ క్లాస్ చేయాల్సిన పని లేదని, కొన్నింటిని వాటికి దూరంగా ఉంచి స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించడమే సరైన పద్ధతి అని నెటిజన్లు వాదించారు. భారత్ విశ్వగురువు ఎలా అవుతుందని, పాశ్చాత్య రీతులను కాపీ చేస్తే సరిపోతుందా? దాన్నే వరల్డ్ క్లాస్ అనాలా? అని కేంద్రంపై ఫైర్ అయ్యారు. భారత సంస్కృతిని ప్రపంచ శ్రేణికి తగినట్టుగా నిర్మించడమే అసలైన గొప్పతనమని పేర్కొన్నారు. అంతేకానీ, ప్రస్తుత డిజైన్ ఓ ప్రభుత్వ బిల్డింగ్ లాగా, ఓ కార్పొరేట్ ఆఫీసులాగా ఉన్నదని ఆరోపించారు. అంతేకాదు, ఆ చిత్రాన్ని చూస్తే.. అందులో క్రిస్టియన్ లేదా చర్చ్ ఈస్తటిక్స్ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఓ హాస్పిటల్‌లా ఉన్నదని, లేదా ఓ బ్యాడ్ ఐటీ పార్క్ బిల్డింగ్‌లా ఉన్నదని నెటిజన్లు ఆగ్రహించారు. తిరుపతి అంటే పవిత్ర ఆధ్యాత్మిక ప్రాంతం అని, తమకు ఈ రైల్వే స్టేషన్‌లోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని డిమాండ్లు చేశారు. 

కొందరైతే.. కేంద్ర మంత్రులను ట్యాగ్ చేస్తూ.. ఈ డిజైన్‌ను మార్చాలని డిమాండ్ చేశారు. ఓ వ్యక్తి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ట్యాగ్ చేసి.. ఈ డిజైన్ మార్చడానికి ప్రయత్నించాలని కోరారు. ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఈ చర్చలోకి వెళ్లారు. ఈ గాజులు, ఐరన్ కాపీలు కాదని, వెస్ట్రన్ స్టైల్‌ను కాపీ కొట్టకుండా.. ఆధ్యాత్మికతను ప్రతిబింబించేలా నమూనాను మార్చాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం