నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది: నారా లోకేష్

Published : Jun 19, 2022, 11:49 AM IST
నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది: నారా లోకేష్

సారాంశం

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అధికారులు కూల్చివేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని లోకేష్ ఎద్దేవా చేశారు. 

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అధికారులు కూల్చివేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్టులు చేశారు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగన్ గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఉత్తరాంధ్రలో చంద్రబాబు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి పిరికిపంద చర్యలు మొదలెట్టారని అన్నారు. 

అయన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా చెప్పారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఇక, అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత వైసీపీ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతతోనే సీఎం జగన్ పాలన మొదలైందని టీడీపీ నేత బొండా ఉమా విమర్శించారు. సీఎం జగన్ ఇంటి పునాదులు కదలడంతోనే.. టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. ‘‘జగన్ ఇవాళ మీది.. రేపు మాది’’ అని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని.. అందుకే టీడీపీ నేతల ఇంటి గోడలు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి ఆదేశాలను అధికారులు పాటిస్తున్నారని.. అధికారం ఉందని కొందరు రెచ్చిపోతున్నారని విమర్శించారు. వెల్లంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడిని అరెస్ట్ చేయిస్తారా అని ప్రశ్నించారు. అయ్యన్నను అక్రమ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వేధింపులకు భయపడేది లేదని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. నర్సీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. పంట కాల్వను అక్రమించి గోడ నిర్మించారని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలోనే అయ్యన్న ఇంటి వెనకాల ఉన్న గోడను మన్సిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. మరోవైపు అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను కూడా లోనికి అనుమతి ఇవ్వడం లేదు. అయ్యన్నపాత్రుడి ఇంటివైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకోకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

 మరోవైపు అయ్యన్న ముఖ్య అనుచరుడు వెంకటరమణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరికొందరు అయ్యన్న అనుచరులు, టీడీపీ కార్యకర్తలను పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో నర్సీపట్నంలో హై టెన్షన్ నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Markapuram Accident:కదిలిస్తే కన్నీళ్లే.. మార్కాపురం బస్సుబాధితుల పరిస్థితిఇదీ | Asianet News Telugu
Markapuram Bus Accident Aftermath | Vehicles Removed Using Crane Accident Spot | Asianet News Telugu