కిడారి, సోమల హత్య.. స్పందించిన మావోయిస్టులు

By ramya neerukondaFirst Published Oct 27, 2018, 10:00 AM IST
Highlights

ప్రభుత్వ హింసాకాండకు జవాబుగానే కిడారి, సోమలను హత్యచేసినట్టు సీపీఐ మావోయిస్టు ఏవోబీ ప్రతినిధి జగబంధు వెల్లడించారు.

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు అతి కిరాతకంగా  హత్య చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై తాజాగా మావోయిస్టులు తొలిసారిగా స్పందిచారు.

ప్రభుత్వ హింసాకాండకు జవాబుగానే కిడారి, సోమలను హత్యచేసినట్టు సీపీఐ మావోయిస్టు ఏవోబీ ప్రతినిధి జగబంధు వెల్లడించారు. ఈ మేరకు ఆయ న పేరుతో శుక్రవారం మీడియాకు లేఖ అందింది. మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలు ఆగిపోయిన విషయా న్ని ఆ లేఖలో అంగీకరించారు. అయితే, లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్లు వంటి విలువైన సహజ ఖనిజాలను అధికార పార్టీ నాయకులు అక్రమంగా దోచుకుంటున్నారని పేర్కొన్నారు. 

‘‘ఎమ్మెల్యే కిడారి లేటరైట్‌, గ్రానైట్‌, రంగురాళ్ల క్వారీలను నిర్వహించారు. ఆ క్వారీలను నిలిపివేయాలంటూ ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు.
 ఈ సమస్యపై పోరాడుతున్న స్థానికులు, సంఘాలపై ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. ఈ అణచివేతకు ప్రతిఘటనగానే ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలపై చర్య తీసుకొన్నాం’’ అని జగబంధు వివరించారు. 

ఈ ఘటన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మన్యంలో యుద్ధ వాతావరణం సృష్టించిందని, తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం, పోలీసులు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతులు చించుకొని అరుస్తున్నారన్నారు. కిడారి, సోమల హత్య తరువాత గిరిజనులపై మన్యంలో పోలీసుల వేధింపులు పెరిగిపోయాయని చెప్పారు. ‘‘గిరిజనుల ఇళ్లలోకి పోలీసులు చొరబడి వస్తువులను నాశనం చేస్తున్నారు. అనేక గ్రామాల్లో యువకులను పట్టుకుపోయి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకొని, వారాలకు వారాలు తమ కస్టడీలో ఉంచుకొంటున్నారు. ఆ తరువాత ఎప్పుడో కోర్టుకు హాజరుపర్చి దొంగ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారు’’ అని విమర్శించారు.

click me!