ప్రముఖ సాహితీవేత్త మొదలి నాగభూషణ శర్మ కన్నుమూత

By pratap reddyFirst Published Jan 16, 2019, 7:58 AM IST
Highlights

మొదలి నాగభూషణ శర్మ 2013లో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం అందుకున్నారు. ఈయన మృతి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు, కవులు, రచయితలు సంతాపం తెలిపారు. 

గుంటూరు: ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మొదలి నాగభూషణ శర్మ కన్నుమూశారు. 1936 జూలై 24న గుంటూరు జిల్లా ధూళిపూడి గ్రామంలో  నాగభూషణ శర్మ జన్మించారు. ఆయన నాటక, కళారంగాల్లో విశేషంగా కృషి చేశారు. 

మొదలి నాగభూషణ శర్మ 2013లో నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం అందుకున్నారు. ఈయన మృతి గురించి తెలుసుకున్న పలువురు ప్రముఖులు, కవులు, రచయితలు సంతాపం తెలిపారు. 

ఆయన తండ్రి కూడా స్వయంగా నాటక రచయిత, ప్రయోక్త, కథా రచయిత. తండ్రి స్ఫూర్తి వల్లనే నాగభూషణ శర్మ నాటకరంగంలోకి వచ్చారు. తండ్రి నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే రంగస్థలంపై తొలిపాఠాలు నేర్చిన శర్మ కాలేజీ రోజుల్లో బందరులో కన్యాశుల్కం నాటకంలో మధురవాణి పాత్రను ధరించి ప్రసిద్ధుడయ్యాడు. కళాశాలలో చదువుతుండగానే ఆయన తొలి రచన అన్వేషణ 1954లో భారతిలో ప్రచురితమైంది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఆంగ్ల సాహిత్య పట్టభద్రుడై నాగభూషణ శర్మ, అమెరికా లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో నాటకదర్శకత్వంలో ఎం.ఎఫ్.ఏ పట్టా పొందారు. నాటకమే ప్రధానాశంగా పరిశోధన చేసి డాక్టరేటు అందుకున్నారు. ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ లోను, నాటక శాఖ లోను ఆచార్యుడిగా పనిచేశాడు.

ది విజిట్, కింగ్ ఈడిపస్, హయవదన, తుగ్లక్, మృచ్ఛకటిక, వెయిటింగ్ ఫర్ గోడో వంటి గ్రీకు, సంస్కృత, ఆంగ్ల నాటకాలకు దర్శకత్వం వహించి హైదరాబాదు డ్రమటిక్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. అడ్డదారి, పెళ్ళికి పది నిమిషాల ముందు, మదనకామరాజు కథ, ప్రజానాయకుడు ప్రకాశం వంటి స్వతంత్ర నాటకాలను, యాంటిగని, మాక్‌బెత్, డాల్స్‌హౌస్, ఎనిమీ ఆఫ్‌ది పీపుల్, ఎంపరర్‌జోన్స్, వెయిటింగ్ ఫర్ గోడో, కాయితం పులి, హయవదన, సాంబశివ ప్రహసనం వంటి గొప్ప పాశ్చాత్య, భారతీయ ప్రముఖ నాటకాలను స్వేచ్ఛానువాదం చేశారు. ప్రజా నాయకుడు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించారు.

విషాదాంతం, జంట పక్షులు, సంభవామి, నరజాతి చరిత్ర, మన్మధుడు మళ్లీ పుట్టాడు, రాజా ఈడిపస్ (అనువాదం), ప్రజానాయకుడు ప్రకాశం మొదలైన నాటకాలను, అన్వేషణ, అడ్డదారి, ఆగస్టు 15, జననీ జన్మభూమి, రాజదండం మొదలైన నాటికలను రచించారు. ఆయన దాదాపు 70 నాటకాలు, నాటికలు, రేడియో నాటికలు రాశారు. 

తెలుగు సాహిత్యం- గాంధీజీ ప్రభావం, నూరేళ్ళ తెలుగునాటకరంగం (సంపాదకులు), లోచన (వ్యాస సంపుటి) వీరి ఇతర రచనలు. 'ప్రకాశం' నాటకానికి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం లభించింది. 

click me!