మోదీ ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయి: మంత్రి యనమల

By rajesh yFirst Published Sep 15, 2018, 3:26 PM IST
Highlights

భారతీయ జనతాపార్టీ అవినీతిపరులతో అంటకాగుతూ దొంగలు అందరినీ దేశం దాటిస్తోందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్‌, తప్పుడు సర్వేలను చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారని విమర్శించారు. 

అమరావతి: భారతీయ జనతాపార్టీ అవినీతిపరులతో అంటకాగుతూ దొంగలు అందరినీ దేశం దాటిస్తోందని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్‌, తప్పుడు సర్వేలను చేయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల ప్రజా సమస్యలపై పోరాడేవాళ్లకు వారెంట్లు ఇచ్చారని విమర్శించారు. 

ప్రజాదరణ ఉన్నవారిని వేధింపులకు గురిచేస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్తామన్నారు. బీజేపీ పెడధోరణులు దేశానికే తీవ్ర ముప్పుగా పరిణమించాయని యనమల తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల వ్యూహాలు వికటిస్తున్నాయన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ ఛోక్సీ పరారీ వెనుక గుట్టును బీజేపీ వెల్లడించాలన్నారు. ఆర్థిక నేరగాళ్లు విదేశాలకు పరారు కావడం వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరో బీజేపీ వెళ్లడించాలని డిమాండ్ చేశారు. 

8ఏళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడితే ఇప్పుడు వారెంట్లు రావడం ఏంటని యనమల ప్రశ్నించారు. తెలుగు ప్రజల సుభిక్షంగా ఉండాలన్న కాంక్షతో బాబ్లీ మీద పోరాటం చేశామని తెలిపారు. 74మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు లాఠీదెబ్బలు తిన్నది తెలుగు ప్రజల కోసమేనన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో టీడీపీని దెబ్బతీయాలన్నదే నరేంద్ర మోదీ వ్యూహమని ఆరోపించారు. 

టీడీపీ నేతృత్వంలో మోదీ వ్యతిరేక శక్తులు బలోపేతం కావడంపై బీజేపీలో అక్కసు నెలకొందని, భాజపా వ్యతిరేక కూటమిని బలహీన పరిచేందుకే మోదీ మహా కుట్రలు పన్నుతున్నారని యనమల ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్లు రావడం కూడా కుట్రలో భాగమేనన్నారు. 

అలాగే మోదీ తనకు అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలతో బోగస్ సర్వేలు చేయించారని ఆరోపించారు. 2014లో ఇవే సంస్థలు చేసిన సర్వేలు అవాస్తవమని ప్రజాతీర్పు రుజువు చేసిందన్నారు. సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేయడం అసాధ్యమని, వేధింపు చర్యలకు ప్రజలే బీజేపీకి గుణపాఠం చెప్తారని అన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో నుంచి టీడీపీని దూరం చేయడం ఎవరి తరం కాదని మంత్రి యనమల స్పష్టం చేశారు.

click me!