మాజీ మంత్రి దేవినేని ఉమపై ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు.
నెల్లూరు: కృష్ణా జలాల విషయంలో ఏపి-తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో ఇరు తెలుగురాష్ట్రాల మధ్య దూరం పెరిగింది. అయితే ఊరికే సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామంటే తెలంగాణకు వచ్చిన నష్టమేమిటో అర్థమవడం లేదంటూ ఏపి నీటిపారుదల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా ఈ వివాదంపై స్పందించారు.
కృష్ణా జలాలను మరింత సమర్థవంతంగా వాడుకోవడం కోసం నిర్మించాలని భావిస్తున్న ఎత్తిపోతల పథకంపై తమ నిర్ణయం తమదేనని అన్నారు. తెలంగాణ వాళ్ళ నిర్ణయం వాళ్లదని... కేవలం ఏపికి రావాల్సిన వాటానే తీసుకుంటున్నామన్నారు.సముద్రంలో కలిసిపోయే మిగులు జలాలను తీసుకుంటే తెలంగాణకు నష్టమేమిటన్నారు. ఈ జలాలను తీసుకోవడం వల్ల నెల్లూరు, రాయలసీమలో ఐదు జిల్లాలో తాగునీటి సమస్య తీరుతుందన్నారు మంత్రి అనిల్ కుమార్.
undefined
పొలిటికల్ స్టంట్ కోసమే కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు టిడిపి హయంలో పూర్తి అయ్యింది అని మాజీ మంత్రి దేవినేని ఉమ చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. అసలు రాయలసీమకు నష్టం చేసిందే టిడిపి అని...నిజంగా రాయలసీమకు న్యాయం చేసి ఉంటే ప్రజలే 10 సీట్లు ఇచ్చేవారన్నారు.
గాలేరు, నగరి పూర్తి చేయకుండానే తామే చేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. టిడిపి హయాంలోనే పోలవరం70 శాతం పూర్తిచేసామని చెప్పుకుంటున్న ఉమా దాన్ని నిరూపిస్తే మీసం తీసుకొని తిరుగుతానని... నిరూపించలేకపోతే ఆయన మీసం తీసి తిరుగుతాడా? అంటూ మంత్రి సవాల్ విసిరారు.
పులిచింతలో ఫుల్ కెపాసిటీని పెట్టింది తామేనని తెలిపారు. చరిత్ర సృష్టించాలి అంటే అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. నీళ్లు అమ్ముకునే బుద్ధి తమది కాదని... అది కేవలం టిడిపి వారికే చెల్లిందన్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోపు నెల్లూరు బ్యారేజిని పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.