చెల్లి ఆరాటమే తప్ప బావ బ్రతకడు... ఇలాగే చంద్రబాబు కూడా బ్రతకడు..: మంత్రి అంబటి సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : May 18, 2022, 03:45 PM IST
చెల్లి ఆరాటమే తప్ప బావ బ్రతకడు... ఇలాగే చంద్రబాబు కూడా బ్రతకడు..: మంత్రి అంబటి సంచలనం

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులు నిరుపయోగంగా మారాయంటూ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, మాజీ సీఎం చంద్రబాబుపై జలవనరుల మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. 

అమరావతి: చెల్లి ఆరాటమే తప్ప బావ బతకడు అన్నట్టుగా... రామోజీరావు (ramojirao), ఎల్లో మీడియా ఆరాటమే తప్ప చంద్రబాబు (chandrababu naidu) రాజకీయంగా బతకడంటూ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (ambati rambabu) ఎద్దేవా చేసారు. దుర్మార్గపు రాజకీయాలు చేసిన పచ్చి మోసగాడు చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కాబట్టి టిడిపిని అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో అబద్ధాలు రాసి వైసిపి ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మానుకుని వాస్తవాలు రాస్తే ప్రజలు మెచ్చుకుంటారని కొన్ని మీడియా సంస్థలకు మంత్రి హితవు పలికారు. 

''ఎల్లో మీడియా ఎన్ని అబద్ధాలు రాసినా జగన్‌ మోహన్‌ రెడ్డికి ప్రజలు దూరం కారు. ప్రజలు ఎప్పుడూ జగన్ పక్షమే. చిత్తశుద్ధితో రైతులకు మేలు చేయాలనే గొప్ప సంకల్పంతో మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ప్రభుత్వం ఇది. రైతులకు త్వరగా నీళ్లు ఇచ్చి మూడు పంటలు పండించే విధంగా చేయాలని తాపత్రయపడుతున్న మా ప్రభుత్వంపై పత్రిక ఉంది కదా అని ఫ్రంట్‌ పేజీలో రోజుకో స్టోరీ రాస్తూ బురదచల్లే కార్యక్రమం చేస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించకతప్పదు'' అని మంత్రి అంబటి హెచ్చరించారు. 

''పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి డయాఫ్రం వాల్‌ దెబ్బతినడం వల్ల పనులు కొద్దిగా కుంటుపడిన మాట వాస్తవం. వరద ఉద్ధృతి వల్ల డయాఫ్రం వాల్‌ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటం, వాటిని సరిచేయాల్సిన అనివార్య పరిస్థితి రావడం విచారకరం. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క తప్పుడు విధానాల వల్లే ఇదంతా జరిగింది. దీనిపై జలశక్తి అడ్వైజర్‌ శ్రీరామ్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఈఎన్‌సీ, సీడబ్ల్యూసీకి సంబంధించిన నిపుణులు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే కంక్లూజన్‌కు వచ్చి రీడిజైన్‌ చేసి ఆ గుంతలు పూడ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి'' అని మంత్రి తెలిపారు.

''డయాఫ్రం వాల్‌పై ఇప్పటికి కూడా సందిగ్ధత కొనసాగుతోంది. డయాఫ్రం వాల్‌ పూర్తిగా దెబ్బతిందో లేదో అని తెలుసుకునే టెక్నాలజీ లేకపోవడం దురదృష్టకరం. ఇప్పటివరకూ ప్రపంచంలో ఎక్కడా డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న సంఘటనలు చూడలేదు. తొలిసారిగా డయాఫ్రం వాల్‌ దెబ్బతినడానికి కారణం చంద్రబాబు నాయుడు. అప్పటి ఇరిగేషన్‌ మంత్రి దేవినేని ఉమా అజ్ఞానం, తొందరపాటు చర్యలు, నిర్ణయాల వల్లే నూటికి నూరుపాళ్లు డయాఫ్రం వాల్ దెబ్బతిన్నది. దీనికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబే. డయాఫ్రం వాల్‌పై రెండు, మూడు నెలల్లోనూ కంక్లూజన్‌కు వస్తుందని భావిస్తున్నాం. దాని తర్వాత డయాఫ్రం వాల్‌ నిర్మాణమో లేక రిపేర్‌ చేసిన తర్వాత ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్లింగ్‌ డ్యామ్‌ను పూర్తి చేసి అనంతరం రైతులకు నీళ్లు అందిస్తాం. అది సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేస్తాం'' అని అంబటి స్పష్టం చేసారు.

''ఈనాడు దినపత్రిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పత్రిక నిత్యం తెలుగుదేశం పార్టీకి బాకా ఊదే ప్రయత్నం చేస్తోంది. ప్రతిరోజూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని పట్టించుకోవడం లేదనో, డ్యామ్‌ల గురించి సక్రమంగా పట్టించుకోవడం లేదనో, పోలవరం గురించి పట్టించుకోవడం లేదనో, పులిచింతల ప్రాజెక్ట్‌ గేటు పోతే దాని ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదనో... ఇలా విషం కక్కాలనే ప్రయత్నం రామోజీరావు, చంద్రబాబు నాయుడు కలిసి చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''చిత్రమేమిటంటే ‘ఎత్తిపోతున్న ఎత్తిపోతల పథకాలు’ అంటూ ఈనాడు పత్రిక ఈరోజు పెద్ద బ్యానర్ వార్త రాశారు. దానిలో సారాంశం ఏంటంటే... రాష్ట్రంలో 250కి పైగా ఎత్తిపోతల పథకాలు, నిర్వహణ, నిధులు లేక దెబ్బతినిపోయాయని, దానికి కారణం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అనేలా మామీద విషం చిమ్మే ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఏ పత్రిక అయినా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే ప్రజలు ఆదరిస్తారు తప్ప పక్షపాత ధోరణితో ఎవరినో అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయంతో పనిచేసే పత్రికలు, మీడియా ప్రజలకు దూరం అవుతాయనేది గమనించాలి'' అని మంత్రి హెచ్చరించారు. 

''ప్రభుత్వంపై ఎలా విషం చిమ్మే కార్యక్రమం చేస్తున్నారంటే... మన రాష్ట్రంలో వ్యవసాయానికి పనికి వచ్చే భూమి సుమారుగా 2వందల లక్షల ఎకరాలు ఉంది. ఇరిగేషన్‌ ద్వారా ఒక లక్షా 4వేల ఎకరాలను సాగు చేస్తున్నాం. ఇంకా 94లక్షల 63వేల ఎకరాలు వర్షాధారంగా పండుతోంది. జలయజ్ఞం కింద వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అనేక ప్రాజెక్ట్‌లు ప్రారంభించి అందులో 31 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావాలని పెద్ద ప్రయత్నం చేపట్టారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీముల ద్వారా సుమారు 8లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాం. వీటికి సంబంధించి  సుమారుగా 1032 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం వాటిని ఎస్టిమేట్‌ చేసి, నిర్మాణం చేసి ఆయుకట్టులో ఉన్న రైతాంగాన్ని ఒక సంఘంగా ఏర్పాటు చేసి, వారికి ఆ నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. వాళ్లు నీటి తీరువాపై ఎకరానికి ఇంతని వసూలు చేసి, దానితో నిర్వహణ చేపడతారు. కరెంట్‌ బిల్లులు మాత్రం ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటిల్లో కొన్నిచోట్ల సరైన నాయకత్వం లేక కొన్ని ఎత్తిపోతల పథకాలు దెబ్బతింటున్నాయి. దెబ్బతిన్నవాటిని సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది. నిర్వహణ లోపం వల్ల కొన్ని కుంటుపడుతున్న మాట వాస్తవం'' అని తెలిపారు. 

''రాష్ట్రంలో 250 ఎత్తిపోతల పథకాలు పనిచేయడం లేదని ఈనాడు రామోజీ రాశారు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, జగన్‌ మోహన్‌ రెడ్డి అని రాశారు. ఈనాడు, ఎల్లో మీడియా, రామోజీరావును సూటిగా ప్రశ్నిస్తున్నాం. 250 స్కీములలో నిర్వహణ లోపాలు నిన్న, మొన్ననో, లేక జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చాయా..? అని సూటిగా అడుగుతున్నాం. డోనేకల్లు ఎత్తిపోతల పథకం నిర్వహణా లోపం, నిర్వహణలో చొరవ లేకపోవడం వల్ల 1989లో ప్రారంభించి, అదే ఏడాదిలోనే మూతపడిందని రాశారు. 1989లో మూతపడిన దానికి జగన్‌ మోహన్‌ రెడ్డి కారణమా? అన్నది రామోజీ చెప్పాలి'' అని అంబటి నిలదీసారు. 

''14ఏళ్లు ముఖ్యమంత్రిగా అఘోరించిన మీ పెద్ద మనిషి చంద్రబాబు ఉన్నాడు కదా? ఆయన హయాంలో రాయలేదేం? ఎన్నికలకు ముందు కూడా ఇదేరకమైన విషం చిమ్ముతూ జగన్‌ పై పుంఖానుపుంఖాలుగా కథలు రాశారు. అంటే అవి ప్రజలు నమ్మితే చంద్రబాబు నాయుడును గెలిపిస్తారనే కదా?, కానీ 2019లో చంద్రబాబు గతి ఏమైందో చూశాం.  1989 నుంచి ఎన్నిసార్లు  చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆరోజు ఏమైనా ఇటువంటి రాతలు రాశారా రామోజీ?'' అని నిలదీసారు. 

''జగన్ ప్రభుత్వంపై అనేక అబద్ధాలు రాసే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పుడో మూలన పడిన ప్రాజెక్ట్‌లను గురించి ఇప్పుడు రాస్తారా? మరి చంద్రబాబు హయాంలో,  ఏ ఒక్క ప్రాజెక్ట్‌ను ప్రారంభించని ఆయన గురించి మాత్రం రాయరా? ఇవాళ రైతు రాజ్యం చేయాలనే దృక్పధంతో, రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంటే,  ఎప్పుడూ ఇవ్వని విధంగా జూన్‌లోనే సాగు నీళ్లు ఇస్తుంటే ఆ మంచి మాత్రం రాయరు ఎందుకు? ఎప్పుడో మూలనపడిన ప్రాజెక్ట్‌లను జగన్‌ నెత్తిన రుద్ది విషం చిమ్మే కార్యక్రమం చేయడం ధర్మమేనా? మీరు రాస్తే అవాస్తవాలను ప్రజలేమీ నమ్మే స్థితిలో లేరు. ఆవిషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు'' అన్నారు. 

''ఫోటో వేసి వైఎస్సార్‌ జిల్లాలో నిరుపయోగంగా ఒంటిమిట్ట-శ్రీరామ ఎత్తిపోతల పథకం అంటూ రాసిన రాతలు పచ్చి అబద్ధం. ఇది ఎల్లో మీడియా అబద్ధం, ఇది రామోజీరావు అబద్ధం. ఇది రామోజీరావు కక్కుతున్న విషం. సోమశిల నుంచి వాటర్‌ లిఫ్ట్‌ చేసి చెరువుకు పంపించి, ఆ చెరువు నుంచి గ్రావిటీ ద్వారా తాగునీరు, సాగునీటికి అందించడం జరుగుతుంది. ఆ చెరువు నిండటంతో మోటార్లు ఆపివేశారు. చెరువు ఖాళీ అయితే మళ్లీ మోటర్లు వేసి నింపుతారు. అంతదానికే నిరుపయోగం, పనికిరావడం లేదంటూ పచ్చి అబద్ధాలు రాయడం సరికాదు'' అంటూ ఈనాడు రాసిన కథనంపై మంత్రి అంబటి విరుచుకుపడ్డారు.

 

 
     

PREV
click me!

Recommended Stories

Markapuram Accident:కదిలిస్తే కన్నీళ్లే.. మార్కాపురం బస్సుబాధితుల పరిస్థితిఇదీ | Asianet News Telugu
Markapuram Bus Accident Aftermath | Vehicles Removed Using Crane Accident Spot | Asianet News Telugu