
నూజివీడు : యావత్ దేశం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ ఓ వివాహిత వరకట్నం వేధింపులకు బలయ్యింది. ఆడవాళ్లు అర్థరాత్రుళ్లు బయటకు వచ్చి స్వేచ్చగా తిరిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని అంటారు... కానీ బయటకు రావడం మాట అటుంచి ఇంట్లోనూ ఆడవాళ్లు స్వేచ్చగా బ్రతికే రోజులు లేవు. ఇలా కట్టుకున్నోడే అదనపు కట్నం వేధించడం తట్టుకోలేకపోయిన ఓ ఇల్లాలు స్వాతంత్య్ర దినోత్సవం రోజే బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణం ఏలూరు జిల్లాలో చోటుచేసుంకుంది.
మృతురాలి సోదరుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ సమీపంలోని నున్న గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన శిరీషతో పెళ్లయ్యింది. భర్త ఫోటోగ్రాఫర్ కాగా, భార్య గ్రామ సచివాలయంలో ఉద్యోగం చేసేది. అయితే కొంతకాలం భార్యతో బాగానే వున్న వెంకటేశ్వరరావు డబ్బుల కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నం సరిపోలేదని... అదనపు కట్నం తీసుకురావాలంటూ వేధించసాగాడు. దీంతో చాలాసార్లు పెద్దమనుషుల వద్ద పంచాయితీ జరిగినా అతడి తీరులో మార్పేరాలేదు. దీంతో అతడి చిత్రహింసలు భరించలేక శిరీష గత ఆదివారం నూడివీడులోని పుట్టింటికి వెళ్లిపోయింది.
వీడియో
అయితే పుట్టింటివారికి భారం కావొద్దని భావించిందో ఏమో శిరీష దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు శిరీషను గమనించే సమయానికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read More ఒంటరిగా ఉంటున్న దళిత వివాహితపై గ్యాంగ్ రేప్.. వైసీపీ నాయకుల దారుణం ?
శిరీష సోదరుడు విశ్వనాథం ఫిర్యాదుమేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తన సోదరి ఆత్మహత్యకు కారణమైన బావ వెంకటేశ్వరరావును కఠినంగా శిక్షించాలని విశ్వనాథం కోరుతున్నాడు.