తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు.
తిరుపతి:తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా అధికారులు ఈ చిరుతపులిని గుర్తించారు.తిరుమల నడక మార్గంలో కన్పించిన ఆరు చిరుతలను ఇప్పటికే అటవీశాఖాధికారులు బంధించారు.బంధించిన చిరుతలలో నాలుగో చిరుత లక్షితపై దాడి చేసిందని అటవీశాఖాధికారులు గుర్తించారు.
2023 ఆగస్టు మాసంలో తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి దాడి చేయడంతో ఆరేళ్ల లక్షిత మృతి చెందింది.ఈ మార్గంలో ఆరు చిరుతలను అటవీశాఖాధికారులు గుర్తించారు. ట్రాప్ కెమెరాల సహాయంతో బోన్లను ఏర్పాటు చేసి చిరుతలను బంధించారు. బంధించిన చిరుతల నుండి సేకరించిన నమూనాల ఆధారంగా నాలుగో చిరుత లక్షితపై దాడి చేసినట్టుగా గుర్తించారు. నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెంకు చెందిన లక్షిత కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అలిపిరి నడక మార్గంలో బంధించిన నాలుగో చిరుత జూలో ఉంచారు అధికారులు. ఈ చిరుతను జూలో ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. తిరుమల నడక మార్గంలో చిరుతలతో పాటు ఇతర అడవి జంతువుల నుండి రక్షణ కోసం భక్తులకు అప్పట్లో కర్రలను అందించిన విషయం తెలిసిందే.