నారా కరోనా: చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణలపై కొడాలి నాని తిట్ల దండకం

By telugu teamFirst Published May 8, 2021, 1:52 PM IST
Highlights

చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణలపై ఏపీ మంత్రి కొడాలి నాని తిట్ల దండకం అందుకున్నారు. కరోనా వైరస్ కట్టడి విషయంలో ప్రభుత్వంపై వారు చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడు అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆయన శనివారం మీడియా సమావేశంలో విమర్శించారు.

కరోనా వ్యాక్సిన్ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందనే చంద్రబాబు విమర్శలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం లేదని, కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేక చంద్రబాబు, ఆయన భజనపరులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. 

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి వద్దంటే ఎన్నికలు పెట్టిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ కారణమని ఆయన అన్నారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదా అని ఆయన అడిగారు.  24 గంటల్లో ఆరు లక్షల మందికి టీకాలు ఇచ్చామని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ కోసం భారత్ బయోటెక్ కు, సీరం ఇనిస్టిట్యూట్ కు లేఖలు రాశామని, తమకు సమయం కావాలని ఆ సంస్థలు చెప్పాయని ఆయన అన్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం జగన్ రెండుసార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు.

ఆ రెండు సంస్థలు కాకుండా ఇంకేమైనా సంస్థలు వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయా అని అడిగారు. అలా చేస్తూ ఉంటే చంద్రబాబు, ఆయన భజనపరులు ఇప్పించాలని, వారు కమిషన్ తీసుకోకుండా ఏ పని కూడా చేయరు కాబట్టి తాము కమిషన్ కూడా ఇస్తామని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ఇప్పిస్తే రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన చెప్పారు.  వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఏ ఖాతాకు పంపాలో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు, రామోజీ రావు, దొంగ పత్రికలు ఆ వివరాలు ఇవ్వాలని ఆయన అన్నారు. 

ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తెప్పించుకుని చంద్రబాబు, ఆయన కుమారుడితో పాటు నలుగురు కుటుంబ సభ్యులు వేసుకున్నారని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు గానీ, రామ్మూర్తి నాయుడి కుటుంబ సభ్యులకు గానీ వేయించలేదని ఆయన అన్నారు. టీడీపీ నేతలకూ కార్యకర్తలకూ వేయించలేదని ఆయన అన్నారు.

కర్నూలులో కొత్త వేరియంట్ వచ్చిందని చంద్రబాబు అంటున్నారని, ఆ వైరస్ కర్నూలు కాదు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో వచ్చిందని, దానిపేరు ఎన్సీబీ 420 నారా కరోనా అని ఆయన అన్నారు. జూమ్ యాప్ పెట్టుకుని చంద్రబాబు పిచ్చికుక్కలా మొరుగుతారని, కులగజ్జి మీడియా వాటిని ప్రసారం చేస్తుందని, తమను భయబ్రాంతులకు గురిచేస్తున్న వారిని ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మందికి కరోనా రావాలనేది చంద్రబాబు, ఆనయకు భజన కొట్టే ఉద్దేశమని కొడాలి నాని అన్నారు. వారిపై కేసులు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

కరోనా కన్నా తామే భయంకరమని చెప్పే వ్యక్తులను జగన్ ప్రజల మద్దతుతో ఉక్కు పాదంతో అణిచేస్తారని ఆయన అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడిని ఆయన దున్నపోతుగా, ఆంబోతుగా అభివర్ణించారు. ఆంబోతుకు ప్యాంట్, షర్ట్ వేసినట్లుగా అచ్చెన్నాయుడు ఉంటారని తాను ఇప్పటికే చెప్పానని ఆయన అన్నారు. అచ్చెన్నాయుడికి మనుషుల ఆస్పత్రిలో కాకుండా పశువుల దవాఖాలో చికిత్స జరగాలని, మనుషులకు చికిత్స చేసే ఆస్పత్రిలో వైద్యం అందించడం వల్ల అచ్చెన్నాయుడి వ్యాధి తగ్గలేదని ఆయన అన్నారు. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రానివారితో పప్పునాయుడు సమావేశాలు పెడుతారని ఆయన అన్నారు.

click me!