సంక్రాంతి పందేల్లో వివాదం... కోడి కత్తితో యువకుడిపై దాడి (వీడియో)

By Arun Kumar PFirst Published Jan 14, 2021, 3:35 PM IST
Highlights

సంక్రాంతి పండగపూట సరదాగా జరుపుకునే కోడి పందేల్లో చోటుచేసుకున్న వివాదం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చిన విషాదం తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. 

కిర్లంపూడి: సంక్రాంతికి గోదావరి జిల్లాల్లో కోడిపందేల హడావిడి అంతా ఇంతా కాదు. అనుమతులు లేకున్నా కోడిపందేలు నిర్వహించడం అక్కడ మామూలే. అయితే కోడి పందేల వేళ చోటుచేసుకున్న వివాదం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. పందేల సమయంలో కోపంతో ఊగిపోయిన యువకుడు కోడి కత్తితో దాడి చేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే
కుప్పకూలిపోయాడు. ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. 

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కిర్లంపూడిలోని రాజాబహద్దూర్ చిన్నారావు దొరగారి కోటలో కోడిపందేలు నిర్వహించారు. పందేల విషయంలో బంధుల మణికంఠకి ముచ్చర్ల రమణ అనే వ్యక్తితో వివాదం తలెత్తింది. ఇద్దరిమధ్య మాటామాటా పెరగడంతో ఆగ్రహం చెందిన మణికంఠ కోడిపుంజుకు కట్టే కత్తితో రమణ పొట్టలో, చేతిపై పొడిచేశాడు. దీంతో రమణ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 

వీడియో

దీన్ని గమనించిన పందెం రాయుళ్లు వెంటనే రమణని ఆటోలో ప్రత్తిపాడు ఆస్పత్రికి తరలించారు. కత్తిపోట్లు ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. నిర్వాహకులు వెంటనే పందేలను నిలిపివేశారు. రమణ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.

 

click me!