టీడీపీలో బాబు తర్వాత బుచ్చయ్యే... ప్రొటెం స్పీకర్‌గా అవకాశం.. మంత్రి ఎందుకు కాలేకపోయారో తెలుసా..?

By Galam Venkata RaoFirst Published Jun 19, 2024, 3:58 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరే. ఈసారి బాబు కేబినెట్లో పదవి ఖాయమనుకున్నా రాలేదు. అయితే, అసెంబ్లీలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 21, 22 తేదీల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే, 24న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరగనుంది. 

ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజుల పాటు అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా... తొలిరోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహరించనున్నారు. ఈ మేరకు బుచ్చయ్య చౌదరికి అసెంబ్లీ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం బుచ్చయ్య చౌదరితో ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. 

Latest Videos

తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు తర్వాత సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలోనూ చంద్రబాబు తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరే ఉంటారు. ఈసారి కేబినెట్ లో ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. అయితే, బుచ్చయ్యకు ఆ ఛాన్స్ రాలేదు. 

 

గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా నరసాయపాలెం గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో జన్మించారు. గోరంట్ల వీరయ్య చౌదరి- అనసూయమ్మ తల్లిదండ్రులు. బాపట్లలో ఎస్ఎల్సీ, రాజమండ్రిలోని వీరేశలింగం విద్యాసంస్థల్లో ఇంటర్మీడియట్, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ చదివారు. చదువు పూర్తయ్యాక వ్యాపార రంగంలోకి ప్రవేశించి.. కలప, లిక్కర్, చేపల చెరువులు, నిర్మాణ రంగం, ఇలా పలు వ్యాపారాలు చేశారు. 

కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరుల కుటుంబం నుంచి వచ్చిన బుచ్చయ్య చౌదరి.... రాజమండ్రిలో కమ్యూనిస్టు పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. తర్వాతి కాలంలో వ్యాపార రంగంలోకి వచ్చిన ఆయన.. కమ్యూనిస్టు పార్టీలకు ఆర్థికంగా సాయం చేశారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక.. ఆ పార్టీలో చేరిన మొదటి వ్యక్తి బుచ్చయ్య చౌదరి సోదరుడు రాజేంద్రప్రసాద్. సోదరుడి ప్రోద్బలంతో ఎన్టీఆర్ సమక్షంలో టీడీపీ చేరి.. గోదావరి జిల్లాల్లో పార్టీ కన్వీనర్‌గా పనిచేశారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేశారు.

బుచ్చయ్య చౌదరి 1983, 1985లలో టీడీపీ నుంచి రాజమండ్రి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీలో ఎంతో ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో కాకుండా పార్టీ కార్యక్రమాలు కోసం బుచ్చయ్యను వినియోగించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జిగా, పార్టీ అధికార ప్రతినిధిగా, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడిగా, పలు పార్టీ కీలకమైన కమిటీల్లో పనిచేశారు. 1987-1989 మధ్య ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్‌ కమిషన్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1989, 1991 లోక్‌సభ ఎన్నికల్లో రాజమండ్రి, అమలాపురం, కాకినాడ పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిగా కొనసాగారు. 

ఇక, 1994లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బుచ్చయ్య చౌదరి ...ఎన్టీఆర్ మంత్రివర్గంలో సివిల్‌ సప్లైస్‌ (పౌరసరఫరాల శాఖ) మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1995 వరకు కొనసాగారు. 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దించడంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా బుచ్చయ్య పోరాడారు. ఎన్టీఆర్ మరణం వరకు ఆయనతోనే నడిచారు. 1996లో ఎన్టీఆర్ టీడీపీ తరఫున రాజమండ్రి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి వ్యవహార శైలి నచ్చక రాజకీయాల్లో కొంతకాలం సైలెంట్‌గా ఉండిపోయారు. 1997లో చంద్రబాబు పిలుపుతో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి... 1999లో నాలుగోసారి రాజమండ్రి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పార్టీ తరపున రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇంచార్జిగా వ్యవహరించారు. 2003లో జరిగిన గోదావరి పుష్కరాలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించారన్న పేరుంది.

ఇక, 2004 నుంచి 2014 వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం బుచ్చయ్య చౌదరి క్రియాశీలంగా పనిచేసి...చంద్రబాబు మన్నలు పొందారు. ఆ తర్వాత 2014లో రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యేగా గెలిచినా.. 2014, 2016 మంత్రివర్గ విస్తరణల్లో చోటు దక్కకపోవడంతో అలకబూనారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన నియోజకవర్గానికి పరిమితమయ్యారు. అనంతరం 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో బుచ్చయ్య చౌదరి ఒకరు. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విపక్ష పార్టీ ఉపనేతగా వ్యవహరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ బుచ్చయ్య చౌదరి 2021లో రాజీనామా ప్రకటించారు. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగి సర్దిచెప్పడంతో చివరికి రాజీనామా వెనక్కి తీసుకున్నారు. ఇటీవల (2024) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 60 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో ఏడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన కూటమిలో తొలి విజయం నమోదు చేసిన ఎమ్మెల్యే కూడా బుచ్చయ్య చౌదరి కావడం విశేషం..

ప్రొటెం స్పీకర్ హోదాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా ఎన్నికైన శాసన సభ్యులతో ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక జరుగుతుంది. కాగా, స్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ మరో సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు ఖరారైనట్లుగా తెలుస్తోంది.  

కాగా, ఈ నెల 24న ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త కేబినెట్‌ తొలి సమావేశం జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుండగా... పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు పంపింది. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 4గంటల్లోపు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని తెలిపింది.

click me!