విజయవాడ టీడీపి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో పార్టీ అధిష్టానం సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా కేశినేని శ్వేత బొండా నివాసానికి వెళ్లనున్నారు.
విజయవాడ: తన తండ్రి, పార్లమెంటు సభ్యుడు కేశినేని నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముగ్గురు నాయకులతో రాజీకి టీడీపీ విజయవాడ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత ప్రయత్నిస్తున్నారు. కేశినేని నానిపై టీడీపీ నేతలు బొండా ఉమా మహేశ్వర రావు, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రేపటి చంద్రబాబు పర్యటనలో కేశినేని నాని ఉంటే తాము పాల్గొనబోమని కూడా వారు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం దిశగా టీడీపీ అధిష్టానం అడుగులో వేస్తోంది. ఇందులో భాగంగానే కేశినేని శ్వేత బొండా ఉమా మహేశ్వర రావు ఇంటికి వెళ్లనున్నారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆమె బొండా ఉమా, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలను కోరనున్నారు. రేపు విజయవాడలో జరిగే చంద్రబాబు పర్యటనలో ఆ ముగ్గురు నాయకులు పాల్గొంటారా, లేదా అనే సస్పెన్స్ గానే ఉంది.
undefined
ఇదిలావుంటే, తనపై తమ పార్టీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్న నాగుల్ మీరా చేసిన వ్యాఖ్యలపై మాట్లాడడానికి టీడీపీ ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. తాను మాట్లాడబోనంటూనే కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారిపై తాను ఎవరికీ ఫిర్యాదు చేయబోనని, పార్టీ అధిష్టానమే చుసుకుంటుందని ఆయన శనివారంనాడు అన్నారు.
తెలుగుదేశం పార్టీని విజయవాడలో గెలిపించడంపైనే తాను దృష్టి పెడుతానని ఆయన చెప్పారు. తనకు ఎవిరితోనూ విభేదాలు లేవని చెప్పారు. బిజెపి, వైసీపీ ఎంపీలను లంచ్ కు పిలిస్తే తప్పేమిటని ఆయన అన్నారు. అది సంప్రదాయమని ఆయన చెప్పారు, పార్లమెంటు సెంట్రల్ హాల్ సంప్రదాయాలు ఆ నాయకులకు తెలియదని ఆయన అన్నారు.
తమ పార్టీ నేతలు తనపై చేసిన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆదేశిస్తే నిమిషంలో తన ఎంపీ పదవికి తాను రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు ప్రచారం రూట్ మ్యాప్ ను తాను మార్చలేదని, అది పార్టీ నిర్ణయమని ఆయన అన్నారు. అది పార్టీ చూసుకుంటుందని, తనకు సంబంధం లేదని ఆయన అన్నారు.
తాను పార్టీ కోసం కష్టపడుతున్నానని, పార్టీ ఏది చెప్తే అది చేస్తానని ఆయన చెప్పారు. విజయవాడ కార్పోరేషన్ లో టీడీపీ జెండాను ఎగురేయడమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. పార్లమెంటులో తన గొంతు వినిపిస్తున్నానని ఆయన అన్నారు. ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదని చంద్రబాబు చూసుకుటారని ఆయన అన్నారు
ప్రజలకు స్పష్టత ఉందని, మాట్లాడకపోవచ్చు గానీ వారికి స్పష్టత ఉందని, ఐదేళ్ల చంద్రబాబు పాలనపై, ఇప్పటి పాలనపై ప్రజలకు స్పష్టత ఉందని ఆయన అన్నారు. సీపీఐ, టీడీపీ కలిసి 45 నుంచి 50 వార్జులను గెలుస్తాయని ఆయన అన్నారు. తన దారిలో తాను వెళ్తుండవచ్చు, తన దారి వారికి నచ్చకపోవచ్చునని, ఆ విషయం చంద్రబాబు చూసుకుంటారని ఆయన అన్నారు. ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరి అభిప్రాయం వారిదని ఆయన అన్నారు. అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందని ఆయన అన్నారు.