
అమరావతి: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేయి పెడుతున్నారా? అవునని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒకరు. ఈ విషయాన్ని ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో జరిగిన సమావేశంలో అన్నట్లు తెలుస్తోంది.
తాజా రాజకీయ పరిణామాలపై, మావోయిస్టుల కదలికలపై చంద్రబాబు బుధవారం పార్టీ ముఖ్య నేతలతో, మంత్రులతో చర్చించారు. ఈ సమావేశంలో చంద్రబాబు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా కలిసి పని చేద్దామని తాను కేసిఆర్ కు సంకేతాలు ఇచ్చానని, ప్రధాని మోడీ మాయలో పడి ఆయన అందుకు అంగీకరించలేదని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయడానికి కేసిఆర్ మోడీతో కలిసి పనిచేస్తున్నారనే అభిప్రాయన్ని కూడా ఆయన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణలో కూటమి కట్టడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని ఓ సీనియర్ మంత్రి అన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపికి వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కలపడానికి కేసిఆర్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం తెలంగాణలో జరుగుతోందని ఆయన అన్నారు.
అన్ని రకాల కుట్ర, కుమ్మక్కు రాజకీయాలను ఎదుర్కోవాలని చంద్రబాబు మంత్రులకు, నేతలకు సూచించారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని, అయితే వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా చూసుకోవాలని ఆయన చెప్పారు.
జాతీయ రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలనే విషయంపై స్పష్టత ఉండాలని, బిజెపి వ్యతిరేక పక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నించాలని మంత్రులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తనపై దాడి చేసివారే అరకులో జంట హత్యలకు పాల్పడ్డారని చంద్రబాబు అన్నారు.
తెలంగాణలో ఐటి దాడులు కేంద్రం ప్రమేయంతోనే జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇటువంటి దాడులు జరిగే అవకాశం ఉందని మంత్రులు అన్నారు. ముఖ్యమంత్రిని, మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఆ దాడులు జరిగే అవకాశం ఉందని వారన్నారు.