దేశం విడిచి పోలేదు, మేం బాగున్నాం: అజ్ఞాతం వీడిన కల్కి దంపతులు

By Nagaraju penumalaFirst Published Oct 22, 2019, 11:09 AM IST
Highlights

సోమవారం ఆశ్రమ సిబ్బంది ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లలేదంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే  వారు అందుబాటులో ఉన్నారంటూ వీడియోను మీడియాకు విడుదల చేసింది.  
 

చిత్తూరు: ఎట్టకేలకు కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులు అజ్ఞాతం వీడారు. ఐటీ దాడుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఆశ్రమ వ్యవస్థాపకులైన విజయ్ కుమార్ నాయుడు, పద్మావతి నాయుడు. అయితే కేసులకు భయపడే కల్కి ఆశ్రమ వ్యవస్థాపకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. 

తాజాగా ఐటీ దాడులు ముగిసిన నేపథ్యంలో సోమవారం ఆశ్రమ సిబ్బంది ఆశ్రమ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ నాయుడు అజ్ఞాతంలోకి వెళ్లలేదంటూ ఓ వీడియో విడుదల చేసింది. ఐటీ దాడుల నేపథ్యంలో తమిళనాడులోని నేమమ్ ఆశ్రమంలోనే  వారు అందుబాటులో ఉన్నారంటూ వీడియోను మీడియాకు విడుదల చేసింది.  

తమ ఆరోగ్యం బావుందని, తమ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ వీడియోలో విజయ్‌కుమార్‌ దంపతులు స్పష్టం చేశారు. తాము దేశం విడిచి వెళ్లిపోయానని మీడియాలో కథనాలు వస్తున్నాయని, కానీ, తాము దేశం విడిచివెళ్లలేదని వదంతులు నమ్మెుద్దని కోరారు. కల్కి ఆశ్రమ ప్రధాన కార్యాలయాల్లో యథావిధిగా కార్యక్రమాలు జరుగుతున్నాయని మీడియా సందేశంలో తెలిపారు.  

ఇకపోతే భక్తి ముసుగులో పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నట్టు కల్కి ఆశ్రమంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కల్కి ఆశ్రమంపై తమిళనాడుకు చెందిన ఐటీ అధికారులు కల్కీ ఆశ్రమంపై దాడులు చేశారు.  

నిత్యం వివాదాలకు కేంద్రంగా మారిన కల్కి ఆశ్రమంలో జరిగిన ఐటీ సోదాల్లో కోట్లాది రూపాయలు ఆస్తులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతోపాటు హైదరాబాద్‌లోనూ కల్కి ఆస్తులపై ఇటీవల ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పెద్దసంఖ్యలో బంగారు బిస్కట్లు, ఆస్తులు, కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

click me!