
కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా న్యాయం జరగకపోతే వేర్పాటు ఉద్యమాలు వస్తాయని, ఆకలితో యువత ఉద్యమాల వైపు ఆకర్షితులవుతారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ పరిస్థితులు మారాలంటే రాజకీయ వ్యవస్థ మారాలని, రాజకీయ వ్యవస్థ మారాలంటే యువత ఆలోచన విధానం మారాలని అన్నారు.
పుట్టపర్తి నియోజకవర్గంలోని అమడగూరు మండలం గుండువారిపల్లి గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. రైతులు, సామాన్యుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరవు తీవ్రతకి గ్రామాలకి గ్రామాలు వలస బాట పట్టాల్సి వస్తోందనీ, రెయిన్ గన్స్ ఇస్తున్నామంటూ హడావిడి చేసి, ముఖ్యమంత్రి వచ్చి వెళ్లగానే పీక్కుపోయారని రైతులు వాపోయారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ ఎక్కడ అని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. మీడియాలో కనిపించడానికి ఆయనలా మనకు పేపర్లు, ఛానళ్లు లేవు. జనసైనికుల ఫేస్ బుక్ , వాట్సాప్ లే మనకు ఛానళ్లు, పేపర్లు. అయ్యా సీఎం గారు… రెయిన్ గన్ల పేరు చెప్పి రైతులను ఎక్కడ మోసం చేశారో ఆ గుండువారిపల్లి నుంచే మాట్లాడుతున్నాను. ఇక్కడ వర్షాలు లేవు, నీరు లేదు. పంటలు ఎండిపోయాయి. తీవ్రమైన కరవు పరిస్థితులు ఉన్నాయి. మీకు కనబడుతున్నాయా? అమరావతిలో కూర్చుని రాయలసీమని సస్యశ్యామలం చేశామంటే ఎలా..?’’ అని చంద్రబాబుని పవన్ ప్రశ్నించారు.
‘‘
నేను రాజకీయాల్లోకి వచ్చింది ఓట్ల కోసమో, అద్భుతాలు చేస్తానని చెప్పడానికో కాదు. మన సమస్యలు ప్రపంచానికి చెప్పడానికి వచ్చాను. మన పాలకులు సీమ సమస్యను బయటకు ఎలా చెబుతున్నారంటే .. రెయిన్ గన్లు పెట్టడం వల్ల కరవు పారద్రోలేశాం, వలసలు ఆగిపోయాయి, కియా మోటర్స్ రావడంతో స్థానికులకు ఉద్యోగాలు వచ్చేశాయని చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తే మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్ధమవుతుంది. రాజకీయ నాయకులకి ఓట్లు వేయించుకోవడంలో ఉన్న ఆసక్తి.. మన సమస్యలు తీర్చడంలో లేదు.’’ అని పవన్ రైతులతో అన్నారు.
‘‘ మంత్రి యనమల పంటి వెద్యానికి మూడు న్నర లక్షల ప్రజాధనం ఖర్చుచేశారు. ఏం ఆయనకు ఆస్తులు లేవా..? అంతస్థులు లేవా..? ఒక వైపు ప్రజలు గూడు లేక రోడ్డున పడుతుంటే .. నాయకులు సొంత అవసరాలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఇక్కడ చూస్తే పంటని తడపాలంటే తల్లడిల్లిపోయే పరిస్థితి. నేను మీవాడిని.. మీ సమస్యలు తెలుసుకునేందుకే వచ్చా. ఇక్కడ కరవు పరిస్థితులు తెలుసుకుని అమరావతిలో మాట్లాడుతా. రాయలసీమలో విపరీతమైన కరవు ఉంది. కరవు ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి. కరవు ప్రాంతాల్లో యువతకి ఇచ్చే నిరుద్యోగ భృతి కూడా ఎక్కువ ఇవ్వాలి. రైతులు వలసలుపోకుండా గిట్టుబాటు ధర కల్పించే ఏర్పాట్లు చేయాలి. ’’ అని పవన్ డిమాండ్ చేశారు.
‘‘రాయలసీమ ప్రాంతంలో వలసలు ఆపడానికి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నేను ఎంతో మంది పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతూ ఉంటా. గతంలో యూరోపియన్ బిజినెస్ సమ్మిట్‌కి వెళ్లాను. రేపు అమెరికా వెళ్తున్నా. అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడినప్పుడు వారు చెబుతుంది ఏంటంటే.. పరిశ్రమలు పెడతామంటే మాకు లంచం ఎంతిస్తారని అడుగుతున్నారు. మాకు షేర్లు ఎంతిస్తారని అడుగుతున్నారు. జనసేన పార్టీకి అవేమీ అవసరం లేదు. మా రాయలసీమ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి. వలసలు ఆగాలి.
జనసేన పార్టీ సరదా కోసం పెట్టలేదు. సామాన్యుడి కోసం పెట్టాను. మెడలో ఎర్ర కండువా ఎందుకు వేస్తాను అంటే. అది సామాన్యుడి కండువా. సామాన్యుడి పక్షాన నిలబడతానని చెప్పడానికే ధరిస్తాను.’’ అని పవన్ పేర్కొన్నారు.