TDP-Janasena : టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రణాళికలు వేశాయి. ఈ సభ వేదిక పైకి చంద్రబాబు, పవన్ రానుండటం ఇదే తొలిసారి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ సభ ద్వారా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్టు సమాచారం.
TDP-Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు రానున్న ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి.ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు కుదిరిపోయింది. ఇక తేలాల్సింది ఒక్క సీట్లు లెక్క మాత్రమే. ఈ తరుణంలో ఇరుపార్టీలు జనంలోకి వెళ్లాలని, వారితో మరింత మమేకం కావాలని యోచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో భారీగా బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు వేశాయి.
ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను తమకు అనుకూలంగా మలుచుకుంటాయని, ఈ పాదయాత్ర విజయోత్సవ సభను నిర్వహించేందుకు ప్లాన్లు కూడా వేస్తున్నాయి. ఈ మేరకు ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలేపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తదితరులు పాల్గొననున్నారు.
టీడీపీ, జనసేన పొత్తు ప్రకటన తర్వాత ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ కావడం, అదే సమయంలో ఒకే వేదిక పైకి చంద్రబాబు, పవన్ రానుండటం ఇదే తొలిసారి కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి ఈ సభకు ఇరుపార్టీల శ్రేణులతో పాటు అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఈ సభ ద్వారా ఎన్నికల సమర శంఖాన్ని పూరించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్టు సమాచారం.
ఈ విజయోత్సవ సభను నిర్వహించేందుకు టీడీపీ 14 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, ఆలపాటి, బండారు సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
మరోవైపు.. ఈ విజయోత్సవ సభకు బస్సులు కేటాయించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. అన్ని డిపోల నుంచి అద్దెకు బస్సులు కేటాయించాలని లేఖలో పేర్కొన్నారు.