కత్తిపూడి జంక్షన్ నుండి పవన్ వారాహి యాత్ర: నాదెండ్ల మనోహర్

By narsimha lode  |  First Published Jun 5, 2023, 10:00 PM IST

జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  వారాహి  యాత్ర ఈ నెల  14 నుండి  ప్రారంభించనున్నారు. కత్తిపూడి  జంక్షన్ నుండి  పవన్ కళ్యాణ్  యాత్రను  ప్రారంభిస్తారు. 



అమరావతి: జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  వారాహి  యాత్ర  ఈ నెల  14న  ప్రారంభం కానుంది.  కత్తిపూడి  నుండి  ఈ యాత్ర   ప్రారంభించనున్నారు  పవన్ కళ్యాణ్.   వారాహి యాత్రకు  సంబంధించిన  పోస్టర్ ను  జనసేన  పొలిటికల్  ఎఫైర్స్ కమిటీ  ఛైర్మెన్  నాదెండ్ల మనోహర్  సోమవారంనాడు విడుదల  చేశారు.

తూర్పు  గోదావరి  జిల్లా నుండి  పవన్ కళ్యాణ్  యాత్రను ప్రారంభించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి  జిల్లాల్లో పవన్ కళ్యాణ్   యాత్ర  సాగనుంది. 
అన్నవరం  ఆలయంలో  ప్రత్యేక పూజలు  నిర్వహించిన  తర్వాత  పవన్ కళ్యాణ్  యాత్ర  నిర్వహించనున్నారు.

Latest Videos

తూర్పు గోదావరి  జిల్లాలోని పిఠాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం,కాకినాడ అర్బన్ , కాకినాడ  రూరల్, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి. గన్నవరం నియోజకవర్గాల్లో  యాత్ర సాగనుంది.   ఆ తర్వాత  పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్    యాత్ర  నిర్వహించనున్నారు. 

ఉభయ గోదావరి జిల్లాలో  తమ  పార్టీ కి ఎక్కువగా బలం  ఉంటుందని  ఆ పార్టీ భావిస్తుంది.  అందుకే  ఈ  జిల్లాల్లో  పవన్ కళ్యాణ్  యాత్ర  నిర్వహించనున్నారు.  ఆయా నియోజకవర్గాల్లోని  అన్ని వర్గాల  ప్రజలతో  పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు.  మరో వైపు ఆయా  ప్రాంతాల్లో  ప్రజల  సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకుంటారని  జనసేన నేతలు   చెబుతున్నారు. ప్రతి  నియోజకవర్గంలో  జనవాణి  కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వచ్చే ఏడాది  ఎన్నికలు  జరగనున్నాయి.   ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే   రాష్ట్ర వ్యాప్తంగా  పర్యటించాలని పవన్ కళ్యాణ్  భావిస్తున్నారు.   ఈ మేరకు  వారాహి  యాత్రను  నిర్వహించనున్నారు   పవన్ కళ్యాణ్.

వారాహి  వాహనానికి  తెలంగాణలోని  కొండగట్టు  ఆంజనేయస్వామి  ఆలయంలో  పవన్ కళ్యాణ్ ప్రత్యేక  పూజలు  నిర్వహించారు.  ఆ తర్వాత  విజయవాడలోని  ఇంద్రకీలాద్రి   ఆలయంలో   వారాహి  వాహనానికి  ప్రత్యేక  పూజలు నిర్వహించారు.

ఏపీ రాష్ట్రంలో  టీడీపీ  జాతీయ  ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  ఇప్పటికే  పాదయాత్ర  నిర్వహిస్తున్నారు.  ఈ ఏడాది  జనవరి  27 నుండి  లోకేష్  యాత్ర  సాగుతుంది.  400  రోజుల పాటు  లోకేష్  పాదయాత్ర  నిర్వహించనున్నారు. ఇప్పటికే  ఏపీ రాష్ట్రంలో ఎన్నికల వేడి  రాజుకుంటుంది.  టీడీపీ, జనసేన మధ్య  పొత్తు ఉంటుందని  ఈ రెండు  పార్టీల నేతలు సంకేతాలు  ఇచ్చారు.   అమిత్ షా, జేపీ నడ్డాలతో  చంద్రబాబు  తాజాగా  భేటీ కావడం   రాజకీయ వర్గాల్లో  చర్చకు కారణమైంది. 

  


 


 

click me!