ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు: జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

By telugu teamFirst Published May 21, 2020, 1:38 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. కరోనా వైరస్ తో అట్టుడుకుతున్న రాష్ట్రం వచ్చే రెండు రోజుల్లో నిప్పుల కొలిమిలా మారనుందని ఐఎండి హెచ్చరించింది. పిల్లలూ పెద్దలూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధి వణికిస్తోంది. ఈ స్థితిలో రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉన్నట్లు అర్థమవుతోంది. ఐఎండీ హెచ్చరిక ఆ విషయాన్ని తెలియజేస్తోంది. ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రం నిప్పుల కొలిమి అవుతుందని హెచ్చరించింది. 

పిల్లలూ పెద్దలూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమ, దక్షిణ కోస్తా, తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెద్ద యెత్తున పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. వడగాడ్పులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పింది. 

అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఐఎండీ ప్రజలకు సూచించింది. రేపు, ఎల్లుండి తీవ్రంగా ఉంటాయని చెప్పింది. ఈ నెల 24వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెప్పింది. రెంటిచింతలలో బుధవారంనాడు 47.2 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని చెప్పింది.

ఈ నెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది. దీనికి సంకేతంగానే ఎండులు మండే మండిపోవడంతో పాటు వడగాడ్పులు వీస్తాయని అంటున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో యానాంతో పాటు ఉత్తారంధ్ర, దక్షిణ కోస్్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. 

వేడి వల్ల డీహైడ్రెషన్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. నీల్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు వీలైనంత ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవడం మంచిది. వేడి నుంచి కొంత ఉపశమనం పొందడానికి లేత రంగుల్లో ఉండే వదులైన దుస్తులు వాడాలి. తలపై, ముఖంపై సూర్యకిరణాలు నేరుగా పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలి. లేదంటే గొడుగు వాడాలి.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. ప్రతి రోజూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో మరో 45 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.  గత 24 గంటల్లో 8,092 శాంపిల్స్ ను పరీక్షించగా 45 మందికి కోవిడ్ 19 పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దాంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,452కు చేరుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

నెల్లూరులో తాజాగా ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 41 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటి వరకు 1680 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 718కి చేరింది. తాజా మరణంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ మృతుల సంఖ్య 534కు చేరుకుంది.

click me!