నాకు ఎలాంటి పదవులు వద్దు: జగన్‌కు తేల్చిచెప్పిన రోజా

Siva Kodati |  
Published : Jun 11, 2019, 06:52 PM ISTUpdated : Jun 11, 2019, 08:52 PM IST
నాకు ఎలాంటి పదవులు వద్దు: జగన్‌కు తేల్చిచెప్పిన రోజా

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో నగరి ఎమ్మెల్యే రోజా భేటీ ముగిసింది. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆమె అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో రోజా సమావేశమయ్యారు. వీరి భేటీ కేవలం 10 నిమిషాల్లోనే ముగిసింది

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో నగరి ఎమ్మెల్యే రోజా భేటీ ముగిసింది. మంత్రివర్గంలో స్థానం లభించకపోవడంతో ఆమె అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రితో రోజా సమావేశమయ్యారు. వీరి భేటీ కేవలం 10 నిమిషాల్లోనే ముగిసింది.

ఈ సందర్భంగా ఆమె తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని జగన్‌కు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసేముందు ఆమె వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డితో సమావేశమై.. తనకు జరిగిన అన్యాయంపై వివరించినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగానే కలిశానన్నారు. తాము పదవులు ఆశించి ఎన్నికల్లో నిలబడలేదని రోజా స్పష్టం చేశారు. మంత్రి పదవి రాకపోవడంతో తాను అసంతృప్తికి గురైయ్యానని వస్తోన్న వార్తలన్నీ అవాస్తవమేనన్నారు.

మరో ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి కంటే జగన్ సీఎం కావడమే ఆనందంగా ఉందన్నారు. తమ పార్టీలో అలకలు, బుజ్జగింపులు ఏమీ ఉండవని తెలిపారు.

జగన్‌ను రాష్ట్రానికి సీఎం చేయాలి.. రాజన్న పాలన తీసుకురావాలన్న ఆలోచనతో నే తామంతా పనిచేశామని కాకాణి స్పష్టం చేశారు. జగన్ సీఎం అయితే .. తామంతా సీఎంలు అయినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

నగరి నుండి రెండు సార్లు వరుసగా విజయం సాధించిన రోజాకు జగన్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో చోటు కల్పించలేకపోయినట్టుగా జగన్ రోజాకు వివరించినట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  రోజా అసంతృప్తిగా ఉన్నారు. జగన్ ఆహ్వానం మేరకు ఇవాళ అమరావతికి వచ్చినట్టుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే తాను అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకే అమరావతికి వచ్చినట్టుగా రోజా ప్రకటించారు. తనను ఎవరూ ఆహ్వానించలేదని ఆమె స్పష్టం చేశారు.

మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న రోజా జగన్ తో భేటీ అయ్యారు. అయితే రోజాకు కీలకమైన పదవిని కట్టబెట్టే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ పదవిని రోజాకు ఇస్తారని చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్