పూడిక, నీటి నిల్వపై ఫోకస్: శ్రీశైలం జలాశయంలో హైడ్రో గ్రాఫిక్‌ సర్వే.. ముంబై నుంచి స్పెషల్ టీమ్

By Siva KodatiFirst Published Aug 22, 2021, 8:31 PM IST
Highlights

ఇటీవల సంభవించిన వరదల వల్ల శ్రీశైలం జలాశయంలో ఎంత పూడిక చేరిందో గుర్తించేందుకు గాను అధికారులు హైడ్రో గ్రాఫిక్ సర్వే నిర్వహిస్తున్నారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో నీటినిల్వ 308.62 టీఎంసీలు ఉండగా 2009 వరదల వల్ల 215 టీఎంసీలకు నీటినిల్వ పడిపోయింది.

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించింది. శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీరు, పూడికపై హైడ్రో గ్రాఫిక్‌ సర్వే చేపట్టింది. ముంబయి నుంచి వచ్చిన 12 మంది నిపుణులు హైడ్రో గ్రాఫిక్‌కు సంబంధించిన పరికరాలతో సర్వే  చేపట్టారు. ఇటీవల సంభవించిన వరదల వల్ల జలాశయంలో ఎంత పూడిక చేరిందో గుర్తించేందుకు అధికారులు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో నీటినిల్వ 308.62 టీఎంసీలు ఉండగా 2009 వరదల వల్ల 215 టీఎంసీలకు నీటినిల్వ పడిపోయింది. అప్పట్లో అనూహ్యంగా వచ్చిన వరదల వల్ల సుమారు 93 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని జలశయాల నిర్వహణను కృష్ణా బోర్డు తన ఆధీనంలోకి తీసుకోనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జలాశయం నీటినిల్వ, పూడికపై మరోసారి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వే 15 రోజులపాటు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

Also Read:ఏపీ, తెలంగాణ జలజగడానికి చెక్, గెజిట్ విడుదల: ప్రాజెక్టులపై పెత్తనమంతా బోర్డులదే

కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్రం పుల్ స్టాప్ పెట్టే దిశగా అడుగులు వేసింది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులన్నీ ఇక నుండి ఆయా బోర్డుల పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు జూలై 16న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ఈ ఏడాది  అక్టోబర్ 14 నుండి అమల్లోకి రానుందని కేంద్రం స్పష్టం చేసింది.

ఒక్కో రాష్ట్రం బోర్డుల నిర్వహణ కోసం రూ. 200 కోట్లు కేటాయించాలని కేంద్రం ఆదేశించింది.రెండు మాసాల్లో  ఈ నిధులను  జమ చేయాలని  కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులన్నీ  ఆరు మాసాల్లోపుగా అనుమతులు తెచ్చుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అనుమతులు పొందడంలో విఫలమైతే ప్రాజెక్టులు పూర్తైనా  వాటిని నిలిపివేయాలి.
 

click me!