ముఖం చాటేసిన వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఉక్కపోత, పెరుగుతున్న ఎండలతో అల్లాడుతున్న జనం

Siva Kodati | Published : Oct 7, 2023 5:51 PM

వర్షాలు ముఖం చాటేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కారణంగా వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా వుంటోంది. 

Google News Follow Us

వర్షాలు ముఖం చాటేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత ఆకస్మాత్తుగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగిపోయింది. దీంతో భానుడు  నిప్పులు కక్కుతున్నాడు. పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత కారణంగా వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా వుంటోంది. దీంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కూల్‌డ్రింక్స్, జ్యూస్‌లు, ఇతర శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఇళ్లు , కార్యాలయాల్లో కూలర్లు, ఏసీల వినియోగం అధికం కావడంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్, నవంబర్‌ నెలల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం వుందని ఐఎండీ ముందుగానే అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా గాలిలో తేమ శాతం పెరుగుతోంది. విశాఖలో తీరం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వున్న ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా వుంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడితేనే ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.