అతి పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్: చంద్రబాబు ప్రభుత్వంపై గవర్నర్ కు జీవీఎల్ లేఖ

By pratap reddyFirst Published 11, Aug 2018, 4:29 PM IST
Highlights

దేశంలో అతి పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహా రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్ కు ఓ లేఖ రాశారు. 

న్యూఢిల్లీ: దేశంలో అతి పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవిఎల్ నరసింహా రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్ కు ఓ లేఖ రాశారు.  ఆంధ్రప్రదేశ్‌ పీడీ అకౌంట్స్‌లో భారీగా నగదు జమ చేయడంపై కాగ్‌ స్పెషల్‌ ఆడిట్‌, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. 

కాగ్ స్పెషల్ ఆడిట్ కు జరిగితే పెద్ద మొత్తంలో పీడీ ఖాతాల్లో వ్యక్తిగతంగా డబ్బులు డ్రా చేసినవారు బయటకు వస్తారని, దోపిడీ ఏ మేరకు జరిగిందో గుర్తించడానికి వీలవుతుందని ఆయన అన్నారు.  దాదాపు రూ.53,038 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం పీడీ అకౌంట్స్‌లో వేసిందని తెలిపారు. 

2016-17 కాగ్‌ రిపోర్ట్‌ చూస్తే ఇదో భారీ కుంభకోణం అనిపిస్తోందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం 58,539 పీడీ అకౌంట్లు తెరిచిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని పరిశీలనలోకి తీసుకుని విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు.

పీడీ అకౌంట్స్ వ్యక్తిగతమైనవని, వాటి నుంచి డబ్బు చెల్లింపులు వ్యక్తులు చేయడానికి వీలుంటుందని, ఆ డబ్బులు ఎందుకు దేనికి కోసం చెల్లించారనేది తెలియడం లేదని ఆయన అన్నారు. వాస్తవానికి పీడీ ఖాతాల్లోకి కొద్దిపాటి మొత్తాలను మాత్రమే బదలాయిస్తారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా నిధులు బదలాయించారని, ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో పీడీ ఖాతాల్లో డబ్బులు బదలాయించలేదని కాగ్ కూడా విస్తుపోతోందని ఆయన అన్నారు. 

కన్సాలిడేటెడ్ ఫండ్స్ నుంచి పీడీ ఖాతాల్లో డబ్బులు మళ్లించి, ఖర్చయ్యాయని దొంగ లెక్కలు చెప్పడానికి వీలువుతందని ఆయన అన్నారు. అడ్డగోలుగా డబ్బులు వాడుుకోవడానికే పీడీ ఖాతాల్లోకి అంత పెద్ద మొత్తాలు బదలాయించారని ఆయన ఆరోపించారు. ఆ డబ్బులు ఎవరికిచ్చారని అడిగితే చెప్పలేమని రాష్ట్ర ప్రభుత్వం అంటోందని ఆయన అన్నారు. 

కాగ్ చేసిన నమూనా తనిఖీయే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, పీడీ ఖాతాల్లోంచి అధికారులు 2057 కోట్లు అధికారులు సెల్ఫ్ చెక్కుల ద్వారా డ్రా చేశారని తేల్చిందని, స్పెషల్ ఆడిట్ జరిగితే మొత్తం కుంభకోణం బట్టబయలవుతుందని ఆయన అన్నారు. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆడిట్ కు అంగీకరించాలని ఆయన అన్నారు. 

Last Updated 9, Sep 2018, 11:35 AM IST