
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం తురకపాలెంలో ఓ వ్యక్తి కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రికార్డు చేసిన సెల్పీ వీడియోలో తన భార్య ప్రవర్తన సరిగా లేదని చెప్పాడు. భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని షేక్ భరన్‌గా గుర్తించారు. ఇక, వీడియోలో.. తన భార్య ఏడాది పాటుగా తనను మోసం చేసిందని అతడు ఆరోపించాడు.
తన భార్య వేరే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుందని చెప్పాడు. ఇది తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు తనను తప్పుబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను చంపేందుకు పలుమార్లు ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. వ్యవస్థ మీద నమ్మకం ఉందని.. తన భార్యను కఠినంగా శిక్షించాలని కోరాడు. తన భార్య కాల్ వివరాలను ఇక్కడే ఉంచుతున్నానని చెప్పాడు. అనంతరం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.