గుంటూరు బీటెక్ స్టూడెంట్ రమ్యశ్రీ హత్య కేసులో దోషి శశికృష్ణకు కోర్టు ఉరి శిక్షను విధించింది. గత ఏడాది ఆగష్టు 15న శశిక్షణ రమ్యను కత్తితో పొడిచాడు.
గుంటూరు: బీటెక్ విద్యార్ధిని రమ్యశ్రీ హత్య కేసులో దోషి శశికృష్ణకు గుంటూరు ఫాస్ట్ ట్రాక్ కోర్టు శుక్రవారం నాడు ఉరి శిక్ష విధించింది.ఇవాళ ఉదయం రమ్యశ్రీ హత్య కేసుకు నిందితుడు శశికృష్ణను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. శశికృష్ణ కోర్టుకు హాజరైన తర్వాత ఈ కేసులో శశికృష్ణను దోషిగా నిర్ధారించింది. మధ్యాహ్నం తీర్పు వెల్లడించనున్నట్టుగా పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు కోర్టు తీర్పును వెల్లడించింది.
ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు కోర్టు తీర్పును జడ్జి చదివి విన్పించారు. ఇతర రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న నేరాలను కూడా జడ్జి తన తీర్పులో ప్రస్తావించారు. నిస్సహాయురాలైన యువతిని ప్రేమ పేరుతో వేధించి హత్య చేయడాన్ని కోర్టు ప్రస్తావించింది. స్వాతంత్ర్యం వచ్చిన రోజునే పట్టపగలే ఈ హత్య చేశారని కూడా కోర్టు గుర్తు చేసింది. నిందితుడికి ఉరి శిక్ష విధిస్తున్నట్టుగా జడ్జి ప్రకటించారు. అయితే ఈ తీర్పు వెల్లడించగానే దోషి శశికృష్ణ జడ్జికి రెండు చేతులు జోడించి అలానే ఉండి పోయారు. మరో వైపు ఈ తీర్పుపై శశికృష్ణకు నెల రోజుల సమయం ఇచ్చింది కోర్టు.మరో వైపు కోర్టు శశికృష్ణకు ఉరిశిక్ష విధించడాన్ని మహిళా సంఘాలు, రమ్యశ్రీ పేరేంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది ఆగష్టు 15వ తేదీన తన ఇంటికి సమీపంలోని టిపిన్ సెంటర్ వద్ద రమ్యశ్రీని నిందితుడు శశికృష్ణ కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రమ్యశ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో 36 మంది సాక్షులను కోర్టు విచారించింది.
గుంటూరు జిల్లాలోని చేబ్రోలులోని సెయింట్ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో రమ్యశ్రీ బీటెక్ చదువుతుంది. ఆగష్టు 15న తన ఇంటికి సమీపంలలోని టిఫిన్ సెంటర్ వద్ద శశికృష్ణ రమ్యశ్రీని అత్యంత దారుణంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకు మండలం మట్లూరు గ్రామానికి చెందిన కుందాల శశికృష్ణను ఘటన 48 గంటల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.ఇన్‌స్టా గ్రామ్ లో రమ్యశ్రీ, శశికృష్ణకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత శశికృష్ణ తనను ప్రేమించాలని ఆమె వెంట పడ్డాడు. కానీ శశికృష్ణను ఆమెదూరం పెట్టింది. తనను ప్రేమించకపోతే చంపేస్తానని కూడా హెచ్చరించాడు. అయితే ఆగష్టు 15న రమ్యశ్రీని పిలిపించి హత్య చేశాడు. హత్యకు ముందు ఎనిమిది నిమిషాలు నిందితుడు మాట్లాడాడు. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి చంపాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులు శశికృష్ణను అడ్డుకొంటే రమ్యశ్రీ బతికేదని అప్పట్లో పోలీసులు ప్రకటించారు.
బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని నరసరావుపేటలోని పమిడిపాడు వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ క్రమంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను గమనించిన బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అక్కడి నుంచి గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు.