ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తాం: రావెల కిషోర్ బాబు

By Sumanth KanukulaFirst Published Jan 2, 2023, 1:53 PM IST
Highlights

రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది చెందిందని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. అయితే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం కుక్కలు చింపిన విస్తరి అయిందని చెప్పుకొచ్చారు. 
 

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా రావెల కిషోర్ బాబు ఓ న్యూస్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది చెందిందని అన్నారు. ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణను బంగారు రాష్ట్రంగా మారుస్తున్నారని చెప్పారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం కుక్కలు చింపిన విస్తరి అయిందని చెప్పారు. టీడీపీ, వైసీపీల మధ్య అధిపత్య పోరులో.. ఏపీ అభివృద్దిలో, సంక్షేమంలో వెనుకబడిపోయిందని అన్నారు. ప్రజలు నిరాశలో ఉన్నారని చెప్పారు. 

ఏపీలో ఉన్న పార్టీలు రాష్ట్రాన్ని మరింతగా  నాశనం  చేస్తాయని ప్రజలు ఒక అభిప్రాయానికి వచ్చారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఏపీ అభివృద్ది జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామని  చెప్పారు. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదన్నారు. ప్రతిపక్ష పార్టీలను బీజేపీ వేధిస్తుందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. బీజేపీకి తగిన బుద్ది చెబుతారని అన్నారు.  తాను చివరి శ్వాస వరకూ కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పారు. 

రావెల కిషోర్ బాబు విషయానికి వస్తే.. ఆయన ఐఆర్‌టీఎస్ మాజీ అధికారి. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో రావెలకు చోటు దక్కింది. రావెల కిషోర్ బాబు కారణంగా పార్టీకి ఇబ్బందులు ఏర్పడ్డాయని  పార్టీ నాయకత్వం భావించింది. దీంతో  మంత్రివర్గం నుండి రావెల కిషోర్ బాబును చంద్రబాబు తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన రావెల కొంతకాలం పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. 

తర్వాత 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు జనసేన పార్టీలో చేరారు. అయితే ఆ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది  రోజులకే రావెల జనసేనను వీడి.. బీజేపీలో చేరారు. కాషాయ కండువా కప్పుకున్న కొత్తలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా కొనసాగారు. అయితే కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న కిషోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. 
 

Also Read: బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ !!

ఇక, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో ఈరోజు ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తదితరులు బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఈ సందర్భంగా ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు సంబంధించి కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. 
 

click me!