పోటీ వస్తారో, తమనే తప్పిస్తారో: కన్నా రాకతో టీడీపీలోని ఆ వర్గం నేతల్లో గుబులు.. బాబుపైనే భారం

Siva Kodati |  
Published : Feb 26, 2023, 03:59 PM ISTUpdated : Feb 26, 2023, 04:02 PM IST
పోటీ వస్తారో, తమనే తప్పిస్తారో: కన్నా రాకతో టీడీపీలోని ఆ వర్గం నేతల్లో గుబులు.. బాబుపైనే భారం

సారాంశం

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ అధిష్టానం సూచించిన విధంగా నడుచుకుంటానని ఇప్పటికే కన్నా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే లక్ష్మీనారాయణ రాక తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలను కలవరపాటుకు గురిచేస్తోంది. 

మాజీ మంత్రి , సీనియర్ రాజకీయ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన రాజకీయ జీవితంలో సుదీర్ఘకాలం పాటు ప్రత్యర్ధిగా వున్న టీడీపీలో ఆయన చేరారు. యూత్ కాంగ్రెస్ నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా .. ఇలా దాదాపు నాలుగు దశాబ్థాల అనుభవం కన్నాకు వుంది. దీనికి తోడు ఏపీలో అత్యంత బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడం కన్నాకు అదనపు బలం. అందుకే ఆయన బీజేపీకి రాజీనామా చేసిన వెంటనే టీడీపీ, జనసేన, వైసీపీలు తమ పార్టీల్లో చేరాల్సిందిగా ఆహ్వానాలు పంపాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ఇతరత్రా లెక్కలు కట్టుకుని కన్నా .. తన సామాజిక వర్గానికి చెందిన జనసేనను కూడా కాదని టీడీపీవైపే మొగ్గుచూపారు.

సుదీర్ఘకాలం పాటు పలు కీలక పదవుల్లో వున్న కన్నా లక్ష్మీనారాయణ.. కాంగ్రెస్‌లో కీలక నేత, ఒకానొక దశలో ఉమ్మడి ఏపీలో సీఎం అభ్యర్థుల జాబితాలోనూ ఆయన పేరు వుంది. అలాంటి నేత రాష్ట్ర విభజన తర్వాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకోవడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఆయన బీజేపీలో చేరారు. కమలనాథులు కూడా కన్నాకు రాష్ట్ర అధ్యక్ష పదవిని అప్పగించి గౌరవించింది. కన్నా కూడా తనదైన శైలిలో ప్రభుత్వంపై పోరాడి మంచి మార్కులే కొట్టేశారు. అయితే ఎన్నికల నేపథ్యంలో దూకుడైన నేత కావాలన్న ఉద్దేశ్యంతో సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించారు. దీంతో కొన్నాళ్లు సైలెంట్‌గా వున్న కన్నా లక్ష్మీనారాయణ.. తర్వాత కాలంలో టీడీపీకి దగ్గరయ్యారు . చంద్రబాబుతో ఒకే వేదిక పంచుకోవడం, ఆయనపై ప్రశంసలు , అమరావతి ఉద్యమానికి మద్ధతు వంటి చర్యలతో కన్నా బీజేపీని వీడుతారనే ప్రచారం జరిగింది. సోము వీర్రాజు నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించి ఆయన బీజేపీ నుంచి బయటకు వచ్చేశారు.

ALso REad: టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు..

ఇక ప్రస్తుతానికి వస్తే.. కన్నా టీడీపీ నేత. ఆయనకున్న విశేషమైన రాజకీయ అనుభవం, పలుకుబడిని దృష్టిలో వుంచుకుని కన్నాకు చంద్రబాబు కీలక పదవినే అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గనుక అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందే వ్యక్తుల జాబితాలో కన్నా పేరు వుంటుందని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే టీడీపీలో నెంబర్ 2 పొజిషన్‌కు చేరుకోవడం కన్నాకు పెద్ద విషయం కాదు. 

మరోవైపు.. కన్నా లక్ష్మీనారాయణ రాక టీడీపీలోని సీనియర్లకు మరీ ముఖ్యంగా కాపు వర్గానికి నచ్చడం లేదు. ఆయన పార్టీలోకి రావడానికి ముందే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు అసమ్మతి గళం వినిపించారు. కన్నా కాంగ్రెస్‌లో, బీజేపీలో వున్న రోజుల్లో చంద్రబాబును, తనను తిట్టిన తిట్లకు ఏం సమాధానం చెబుతారంటూ రాయపాటి నిలదీశారు. అటు కన్నాకు కాపు కోటాలో మంత్రి పదవి లభిస్తే తమ పరిస్ధితి ఏంటని ప్రస్తుతం టీడీపీలో వున్న ఆ సామాజిక వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటికే చినరాజప్ప, బొండా ఉమామహేశ్వరరావు, గంటా శ్రీనివాసరావు, వంగవీటి రాధా లాంటి నేతలు కన్నా రాకతో తాము పార్టీలో వెనుకబడిపోతామని భయపడుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే లెక్కలోకి తీసుకుంటున్న చంద్రబాబు.. కన్నా చేరికకు వెంటనే పచ్చజెండా ఊపేశారు. అయితే టీడీపీలో నారా లోకేష్ రూపంలో కన్నా లక్ష్మీనారాయణకు పెద్ద సవాల్ ఎదురుకానుంది. యువకుడైన లోకేష్.. తన కోటరీలో యువకులకే ప్రాధాన్యత కల్పిస్తున్నారు. లోకేష్‌ దూకుడుతో యనమల, కేఈ కృష్ణమూర్తి వంటి సీనియర్ నేతలు కూడా సైలెంట్ అయ్యారు. మరి కన్నా వంటి ఫర్టీ ఇయర్స్ పొలిటిషియన్ టీడీపీలో ఏ మేరకు నెగ్గుకురాగలరో వేచి చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!