పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ పేరిట నకిలీ దృవపత్రాల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు.
పల్నాడు :ఆంధ్ర ప్రదేశ్ కేంద్రంగా సాగుతున్న నకిలీ సర్టిఫికెట్ల దందా గుట్టు రట్టయ్యింది. ఈ నకిలీ దృవపత్రాలతో ఓ యువకుడు విదేశాలను వెళ్లేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. దీంతో ఈ వ్యవహారంపై చెన్నైలో తీగలాగితే ఏపీలో డొంకకదిలింది. పల్నాడు జిల్లాలో కన్సల్టెన్సీ పేరిట నకిలీ సర్టిపికేట్ల దందా చేస్తున్న నిందితుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేసారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీని హరిబాబు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఈ కన్సల్టెన్సీని సంప్రదిస్తుంటారు. అయితే విద్యార్హతలు లేకుండా విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులను దొంగతెలివితో దేశం దాటించేందుకు ప్రయత్నించాడు హరిబాబు. అలాంటి విద్యార్థుల నుండి భారీగా డబ్బులు తీసుకుని అవసరమైన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు అందిస్తున్నాడు. ఇలా నకిలీ సర్టిఫికెట్లు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాడు హరిబాబు.
పల్నాడు జిల్లాకు చెందిన హేమంత్ అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే అతడు హరిబాబుకు చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. అతడికి కూడా విదేశాలకు వెళ్లేందుకు తగిన నకిలీ సర్టిఫికేట్లను సమకూర్చాడు హరిబాబు. అవి తీసుకుని ఇటీవల అమెరికా వీసా కోసం దరఖాస్తు చూసుకున్నాడు హేమంత్. ఈ నెల 16న తమిళనాడు రాజధాని చెన్నైలో యూఎస్ కాన్సులేట్ లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఫార్మాలిటీలో భాగంగా అతడి వద్దవున్న సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని తేల్చారు.
యూఎస్ కాన్సులేట్ అధికారుల ఫిర్యాదు మేరకు చెన్నై సెంట్రల్ క్రైమ్ పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ దందా గురించి బయటపెట్టాడు. వెంటనే నరసరావుపేటకు చేరుకున్న చెన్నై పోలీసులు కన్సల్టెన్సీ యజమాని హరిబాబును అరెస్ట్ చేసారు. హేమంత్ ఒక్కడికే కాదు మరికొందరికి కూడా ఇలాగే నకిలీ ద్రువపత్రాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడికి ఈ నకిలీ సర్టిఫికెట్లు ఎలా వచ్చేవి? దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగేతోంది.