తాను పదవికి రాజీనామా చేశాను కానీ.. మాట్లాడే పెదవులకు కాదన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రస్తుత కాలంలో పోటీతత్వం, సవాళ్లు కూడా పెరుగుతున్నాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
సినిమాల్లో త్రివిక్రమ్ మాదిరిగా రాజకీయాల్లో మాంత్రికుడు ఎవరంటే వెంకయ్య నాయుడు పేరే ఎక్కువగా వినిపిస్తుంది. అచ్చ తెలుగులో అయినా, ఇంగ్లీష్, హిందీలో అయినా ఆకట్టుకునేలా, చమత్కారంగా మాట్లాడే సత్తావున్న నాయకుడు వెంకయ్య. అయితే భారత ఉపరాష్ట్రపతిగా నియమితులైన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైన వెంకయ్య మాటలు తగ్గించారు.
ఈ క్రమంలో వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పదవికి రాజీనామా చేశాను కానీ.. మాట్లాడే పెదవులకు కాదన్నారు. గుంటూరులోని ఆర్‌వీఆర్ జేసీ కళాశాల ఎనిమిదవ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు వెంకయ్య హాజరయ్యారు. అఅనంతరం ఆయన విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగించారు. యువతను మేల్కోల్పడం, ప్రజలతో గడపడం తనకు ఇష్టమైన పని అన్నారు. ప్రపంచంలో యువశక్తి ఎక్కువగా వున్న దేశం మనదేనని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Also Read: కేవలం టిఫిన్ చేసేందుకే విజయవాడకు వెంకయ్యనాయుడు... ఆ ఇడ్లీలే ఎందుకంత ప్రత్యేకం..? (వీడియో)
స్త్రీ, పురుషులిద్దరూ పోటీ ప్రపంచంలో దూసుకెళ్తున్నారని ఆయన ప్రశంసించారు. ప్రస్తుత కాలంలో పోటీతత్వం, సవాళ్లు కూడా పెరుగుతున్నాయని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతి మనదేశానికి, సమాజానికి మంచిది కాదని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. భారతీయ ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడంతో పాటు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన కోరారు.