ఓడిన వాళ్లేందుకు...ఒంగోలు నాదే: మాగుంటపై సుబ్బారెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published 23, Feb 2019, 8:02 PM IST
Highlights

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తానే పోటీ చేస్తానన్నారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యాలు ఒంగోలులో చర్చనీయాంశంగా మారాయి. 

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తానే పోటీ చేస్తానన్నారు వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ఒంగోలులో చర్చనీయాంశంగా మారాయి.

రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఒంగోలు లోక్‌సభకు తానే పోటీ చేస్తానని కార్యకర్తలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉందని వైవి ధీమా వ్యక్తం చేశారు.

మాగుంట పార్టీలోకి చేరుతున్న విషయంపై ఎలాంటి సమాచారం లేదన్నారు. అయినా గతంలో ఓడిపోయిన వారిని పార్టీలోకి చేర్చుకుని గెలిపించుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఒకవేళ శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరితే... ఆయన సేవలు మరో విధంగా ఉపయోగించుకుంటామని స్పష్టం చేశారు. టీడీపీ నుంచి వైసీపీకి భారీగా వలసలు ఉంటాయని సుబ్బారెడ్డి తెలిపారు.

వైఎస్ జగన్ లండన్ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కూతురిని చూడటానికి జగన్ వెళ్తే కుటుంబ విలువలు లేని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు.

సీఎంగా ఐదేళ్లు ప్రజల సొమ్ముతో ఇష్టం వచ్చినట్లు విదేశల్లో తిరిగి, జగన్‌పై అర్థరహితంగా మాట్లాడుతున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించిన వ్యక్తి చంద్రబాబేనని, ఆయన్ను జనం నమ్మరని ఎద్దేవా చేశారు. 

Last Updated 23, Feb 2019, 8:02 PM IST