సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. రెండు రోజుల పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు జగన్ ధైర్యం చెప్పారు.
గత ఐదేళ్ల పాటు ప్రజలకు అన్నీ తానై అండదండగా నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ‘ఓటమి తాత్కాలికమే.. ఎప్పటికి నువ్వే మా కింగ్’.. మీపై అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు అంటూ ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. జగన్‌కు ప్రజల్లో ఉన్న ఇమేజ్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆయన ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.
‘ఎక్కడ ఉన్నా రాజు రాజే గెలుపు ఓటములు సహజం.. మళ్లీ నెక్స్ట్ టైమ్ మీకే అవకాశం. మా హృదయాల్లో ఎప్పటికీ ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుంది’’ అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ పేజీలకు లక్షల వ్యూస్ వస్తున్నాయి. కాగా, ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ 40 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. 2019లో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి.
undefined
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. మేనిఫెస్టో హామీలను 99 శాతానికిపైగా అమలు చేసినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు ఈసీ తలొగ్గడం, కొందరు పోలీసు అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్‌మెంట్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మరోవైపు పోలింగ్ బూత్‌ల వద్ద వైసీపీ అనుకూల ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గాయని చెబుతున్నారు. అయినా వైఎస్ఆర్‌సీపీకి 40 శాతం ఓట్లు రావడం వెనుక ఐదేళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఎంతో ఉందంటున్నారు.
మే 13న ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కాగా, ప్రజలు ఊహించని విధంగా తీర్పునిచ్చారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని 164 అసెంబ్లీ, 21 పార్లమెంటు స్థానాల్లో గెలిపించారు. వైఎస్సార్‌సీపీని 11 అసెంబ్లీ, 4 పార్లమెంటు స్థానాలకు పరిమితం చేశారు. దాంతో రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయింది. జగన్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ తమకు 40 శాతం ఓటు షేర్ దక్కిందని జగన్, వైసీపీ నేతలు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఓటమిని చూసి నిరుత్సాహ పడకుండా.. మరో ఐదేళ్లు వేచి చూద్దామన్న ధోరణిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో అధికారం తమదేనన్న ధీమాలో ఉన్నారు.
కాగా, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకొని.. వినతులు స్పీకరించారు. ఎన్నికల ఓటమి తర్వాత జగన్ పులివెందులలో పర్యటిస్తుండటంతో ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. జగన్‌తో ఫొటోలు, సెల్ఫీలు దిగి మురిసిపోయారు. నాయకులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న రోజుల్లో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైయస్ జగన్ భరోసానిచ్చారు.