
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ నాయకులు అరుణ్ సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్ కుమార్.. బీజేపీలో చేరడానికి ముందు ఆ పార్టీ ముఖ్య నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ చర్చలు ఫలించడంతోనే.. శుక్రవారం బీజేపీలో చేరినట్టుగా తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరిన తర్వాత.. ఢిల్లీ బీజేపీ ముఖ్య నాయకులతో కిరణ్ కుమార్ వరుసగా సమావేశమవుతున్నారు.
శుక్రవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా భేటీ అయ్యారు. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణు వర్దన్ రెడ్డి కూడా అమిత్ షాను కలిశారు. అయితే ఏపీ బీజేపీకి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనట్టుగా తెలుస్తోంది.
మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పాటు సోము వీర్రాజు ఢిల్లీలోనే ఉండనున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో కిరణ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ పెద్దలను సోము వీర్రాజు కలవనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పేందుకు సోము వీర్రాజును ఢిల్లీకి పిలిచినట్టుగా తెలుస్తోంది. దీంతో ఏపీలో ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
ఇదిలా ఉంటే.. బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవి కూడా అప్పగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న పరిచయాలు, రాజకీయ అనుభవం దృష్ట్యా తెలంగాణ, కర్ణాటకలలో కూడా ఆయన సేవలను వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత యడియూరప్పతో కూడా కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయినట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, తెలంగాణలలోని రెడ్డి సామాజిక వర్గం నేతలతో టచ్‌లోకి వెళ్లేలా కూడా బీజేపీ అధినాయకత్వం కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది.