వరదను నియంత్రించే ఛాన్స్ ఉంది కానీ....: కృష్ణా వరదలపై చంద్రబాబు ఆరోపణలు

By Nagaraju penumalaFirst Published Aug 23, 2019, 2:37 PM IST
Highlights


తన ఇంటిని ముంచే కుట్రలో భాగంగా ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. రాజధాని అమరావతిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గుంటూరు: కృష్ణా వరదలు ప్రకృతి వైపరీత్యంతో వచ్చినవి కాదని ప్రభుత్వ వైపరీత్యం వల్లే సంభవించాయని ఆరోపించారు మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వరదలను నియంత్రించేందుకు అవకాశం ఉన్నా వైసీపీ ప్రభుత్వం అలా పనిచేయలేదని విమర్శించారు. 

తన ఇంటిని ముంచే కుట్రలో భాగంగా ప్రజలను నిండా ముంచారని ఆరోపించారు. రాజధాని అమరావతిని వరద నీటితో ముంచాలన్న తప్పుడు ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కృష్ణా వరదలను ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయన్నారు. కృష్ణా వరదలకు సంబంధించి గుంటూరు పార్టీ కార్యాయలంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 

వరద సంభవించిన నాటి నుంచి నేటి వరకు సీబడ్ల్యూసీ లెక్కలను సేకరించిన చంద్రబాబు వరదకు అసలు కారణం ఇదేనంటూ చెప్పుకొచ్చారు. ఆల్మట్టి నుంచి నారాయణ్ పూర్ కు వరద నీరు చేరుకోవాలంటే 12 గంటల సమయం పడుతోందని చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర సముద్రంలో కలిసే వరకు కృష్ణానది 1400 కిమీ ప్రయాణిస్తుందని గుర్తు చేశారు. 

నారాయణపూర్‌ నుంచి జూరాల రావాలంటే 30 గంటలు పడుతుందన్నారు. అలాగే జూరాల నుంచి శ్రీశైలానికి వరద రావాలంటే 30 గంటలు పడుతుందని వివరించారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు వరద రావాలంటే 12 గంటలు పడుతుందని చెప్పిన చంద్రబాబు సాగర్‌ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద రావాలంటే 24 గంటలు పడుతుందని చెప్పుకొచ్చారు. 

ఈ లెక్కల ప్రకారం నీటి ప్రవాహాన్ని అంచనా వేసి నియంత్రించే అవకాశం ఉందని కానీ అలా చేయలేదని మండిపడ్డారు. నీటి ప్రవాహానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారుల వద్ద ఉన్నాయని తెలిపారు. ఏ రిజర్వాయర్ లో ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసుకోకుండా నీటిని వదిలేశారని చెప్పుకొచ్చారు. అందువల్లే ప్రకాశం బ్యారేజీ దిగువ లంక గ్రామాలు వరదల్లో మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

కృష్ణా వరదలపై సీఎం జగన్ ఏనాడు సమీక్ష నిర్వహించలేదన్నారు. కనీసం వివరాలు కూడా తెలుసుకోలేదని విమర్శించారు. కృష్ణా వరద ప్రభావంతో నష్టపోయిన కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో తాను పర్యటించినట్లు చెప్పుకొచ్చారు. 

రెండు జిల్లాల్లో తాను 19 గ్రామాలు తిరిగానని చెప్పుకొచ్చారు. ఎక్కడ చూసినా బాధాకర పరిస్థితులే ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. సుమారు 53 వేల ఎకరాల పంటభూములు నీట మునిగాయని తెలిపారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. 

click me!