
ఏపీలో ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు , ఓటర్ జాబితాలో అవకతవకలపై వైసీపీ, టీడీపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి పోటాపోటీగా ఫిర్యాదు చేయనున్నాయి. ఈ నెల 28న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ అపాయింట్‌మెంట్ కోరాయి. దీనిలో భాగంగా ఈ నెల 28న సాయంత్రం 4.30 గంటలకు వైసీపీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఖరారు చేసింది.
అయితే అదే రోజున ఢిల్లీకి వెళ్లనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఏపీ ఓటర్ల జాబితాలో ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ కూడా కోరింది. అయితే వైసీపీ ప్రతినిధులు కలవడానికి ఒక గంట ముందుగానే , అంటే ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు టీడీపీకి అపాయింట్‌మెంట్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.
Also Read: TDP: ఓట్ల తొలగింపుపై సీఈసీకి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి చంద్రబాబు
ఓట్ల తొలగింపు ఘటనలతో పాటు మరో పార్టీకి చెందిన సానుభూతిపరుల ఓట్లు చేరడంపై చంద్రబాబు సీఈసీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. టీడీపీకి అనుకూలంగా ఉన్న నకిలీ ఓట్ల తొలగింపుపై ఆయన ఆందోళన వ్యక్తం చేయనున్నారు. వలంటీర్ల ద్వారా ఓట్ల సమాచారాన్ని సేకరించడంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి తెలియజేయనున్నారు. ఉరవకొండ, పర్చూరు, విజయవాడ సెంట్రల్, విశాఖ తదితర ప్రాంతాల్లో ఓటరు జాబితాల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు అందజేయనున్నారు. టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను అధికారులు పట్టించుకోలేదని టీడీపీ నివేదించనుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఓటరు జాబితాల్లో అవకతవకలను అరికట్టేందుకు ఇప్పటికే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ అక్రమాలపై చురుగ్గా సమాచారం సేకరిస్తూ సీఈసీకి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు. ఉరవకొండ కేసులో తీసుకున్న తరహాలోనే సీఈసీ చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు కోరనున్నారు. ఓటర్ల జాబితా నుంచి తొలగించిన వైసీపీసానుభూతిపరుల పేర్లు, అందులో చేర్చిన నకిలీ పేర్లతో కూడిన జాబితాను చంద్రబాబు సమర్పించే అవకాశం ఉంది.