ఈసీ కీలక నిర్ణయం: ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐపీఎస్,ముగ్గురు ఐఎఎస్‌ల బదిలీ

By narsimha lodeFirst Published Apr 3, 2024, 6:46 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పలువురు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను  ఎన్నికల సంఘం బదిలీ చేస్తూ  ఆదేశాలు జారీ చేసింది.గుంటూరు ఐజీ జి. పాలరాజు, పల్నాడు ఎస్పీ జి.రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ, పల్లె జాషువా, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా తిరుమలేశ్వర్ రెడ్డి,  అనంతపురం ఎస్పీ కె.కె.ఎన్. అన్భురాజన్ లను బదిలీ చేసింది.  

మరో వైపు కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజబాబు, తిరుపతి కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, అనంతపురం కలెక్టర్  ఎం. గౌతమి లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని  ఈసీ ఆదేశించింది.  ఈసీ ఆదేశాల మేరకు ఆయా అధికారులను బదిలీ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలోని పలువురు ఐఎఎస్, ఐపీఎస్ తో పాటు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై  విపక్షాలు ఈసీకి ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం సాగుతుంది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి  ఈ ఏడాది మే 13న పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో  తెలుగుదేశం, టీడీపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ  ఒంటరిగానే బరిలోకి దిగుతుంది.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఐఎంలు మరో కూటమిగా పోటీ చేయనున్నాయి.

ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే  రాష్ట్రంలో  పర్యటించిన  ఎన్నికల అధికారులకు  అధికారుల తీరుపై విపక్ష పార్టీల నేతలు  ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లపై   అధికార, విపక్ష నేతలు కూడ  పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే.

click me!