మహిళా టీచర్ వెంటపడుతూ ఆకతాయి వేధింపులు... ఆరు నిమిషాల్లోనే ఆటకట్టించిన దిశ పోలీసులు

By Arun Kumar P  |  First Published Aug 22, 2023, 5:05 PM IST

మహిళ రక్షణ కోసం జగన్ సర్కార్ ఏర్పాటుచేసిన దిశ పోలీసులు ఒంగోలులో ఓ మహిళా టీచర్ ను ఆకతాయి వేధింపులనుండి కాపాడారు. 


ఒంగోలు : మహిళా టీచర్ ను వెంటపడి వేధిస్తున్న ఓ  ఆకతాయిని దిశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతకొంత కాలంగా వెంటపడుతున్నా భరిస్తూ వస్తున్న టీచర్ అతడి ఆగడాలు మితిమీరుతుండటంతో దిశ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న టీచర్ వెంటపడిన ఆకతాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. 

దిశ పోలీసులు తెలిపిన  వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని ఓ ప్రైవేట్ బాయ్స్ స్కూల్లో మహిళ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గతంలో ఆమెతో కలిసి పనిచేసిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ప్రేమపేరుతో వెంటపడుతున్నాడు. స్కూల్ కు వచ్చేటపుడు, ఇంటికి వెళ్లే సమయంలోనూ ఆమె వెంటపడుతూ తనను ప్రేమించాలని వేధించసాగాడు. అంతేకాదు గతంలో ఆమెతో దిగిన ఫోటోలు, మాట్లాడిన కాల్ రికార్డింగ్ చూపించి బ్లాక్ మెయిల్ చేయసాగాడు. తనకు సహకరించకుంటే ఈ ఫోటోలను భర్తకు పంపిస్తానని బెదిరించసాగాడు. 

Latest Videos

undefined

చంద్రశేఖర్ వేధింపులు ఇక భరించలేకపోయిన మహిళా టీచర్ దిశ పోలీసులను ఆశ్రయించింది. సోమవారం  సాయంత్రం స్కూల్ నుండి వెళుతుండగా  చంద్రశేఖర్ వెంటపడుతుండగానే దిశ కాల్ సెంటర్ కు ఫోన్ చేసింది మహిళా టీచర్. దీంతో కేవలం ఆరు నిమిషాల్లోనే మహిళ దగ్గరకు చేరుకున్న పోలీసులు ఆమె వెంటపడుతున్న నీచున్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిని ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

Read More  Prakasam : 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం... ముఖంపై బండరాళ్లు విసిరి...

చంద్రశేఖర్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో మహిళా టీచర్ మార్పింగ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్ లు గుర్తించారు. బాధిత టీచర్ ఫిర్యాదుమేరకు ఈ నీచుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే తన వద్దకు చేరుకుని ఆకతాయి ఆటకట్టించిన దిశ పోలీసులకు మహిళా టీచర్ కృతజ్ఞతలు తెలిపారు. దిశ యాప్ ప్రతి మహిళకు ఆపద సమయంలో ఉపయోగపడుతుందని... దీన్ని తమ మొబైల్ పోన్లలో వుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. 

click me!